పన్నీరు దూకుడు | AiadMK focuses on the quality of the pellet on the formation of party committees | Sakshi
Sakshi News home page

పన్నీరు దూకుడు

Published Thu, Jul 13 2017 3:25 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

పన్నీరు దూకుడు

పన్నీరు దూకుడు

కార్యవర్గానికి కసరత్తు
అనుమతి కోసం సీఈసీకి వినతి

అన్నాడీఎంకేకి కొత్త జట్టును ప్రకటించుకునేందుకు తగ్గట్టుగా పురట్చి తలైవి శిబిరం నేత,మాజీ సీఎం పన్నీరు సెల్వం దూకుడు పెంచే పనిలో పడ్డారు. కార్యవర్గం కసరత్తుల్లో భాగంగా సీఈసీఅనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
సాక్షి, చెన్నై :
రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటుపై పన్నీరు సెల్వం దృష్టి సారించారు. మరోవైపు పార్టీ కేడర్‌ తనవైపే ఉందని చాటుకునేందుకు ఉరకలు వేస్తున్నారు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. ప్రధానంగా అమ్మ, పురట్చి తలైవి శిబిరాల మధ్య అన్నాడీఎంకే కైవశం లక్ష్యంగా సమరం సాగుతోంది.

శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరాన్ని ఎదుర్కొని రెండాకుల చిహ్నం దక్కించుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరం తీవ్రంగానే కుస్తీ పడుతోంది. జయలలిత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా మధుసూదనన్, కోశాధికారిగా పన్నీరు సెల్వం, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పళని స్వామి వ్యవహరించే వాళ్లు. అయితే, అమ్మ మరణంతో మధుసూదనన్, పన్నీరు సెల్వం ఓవైపు ఉండగా, పళనిస్వామి మాత్రం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరం వైపు ఉన్నారు.

దీన్ని అస్త్రంగా చేసుకుని, పార్టీకి నిజమైన నాయకత్వం తమదేనని చాటుకునేందుకు పన్నీరు శిబిరం తీవ్రంగా కసరత్తులు చేస్తూ వస్తున్నది. ఇప్పటికే లక్షల కొద్ది పేజీలు, వివిధ అంశాల్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందించి ఉన్నారు. తామేమీ తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ శిబిరం సైతం తమ వద్ద ఉన్న ఆధారాలను ప్రమాణపత్రంగా సీఈసీకి అందించింది. ఈ పోరు ఓవైపు ఉంటే, మరోవైపు  సీజ్‌ చేసిన రెండాకుల చిహ్నం కైవశం, ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ద్వారా ప్రకటింపజేసుకుని, పార్టీ, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలన్న కాంక్షతో పన్నీరు సెల్వం తీవ్రంగానే ఉరకలు తీస్తున్నారు. కేడర్‌ తన వైపు ఉందని చాటుకునే దిశగా సాగుతున్న పన్నీరు సెల్వం బహిరంగ సభలకు మంచి స్పందనే వస్తుండటం గమనార్హం.

పన్నీరు దూకుడు
మరింతగా దూకుడు పెంచిన పన్నీరు సెల్వం, తన నేతృత్వంలో అన్నాడీఎంకే కమిటీని ప్రకటించేందుకు కసరత్తుల్లో పడ్డారు. అమ్మ శిబిరం వెంట గతంలో నియమించిన కమిటీలు ఉన్నా, పురట్చి తలైవి శిబిరానికి అంటూ ప్రత్యేకంగా కార్యవర్గం లేదు. దీంతో అన్నాడీఎంకే తమ శిబిరానిదేనని చాటుకునే రీతిలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పార్టీ, అనుబంధ విభాగాల కార్యవర్గాల ఏర్పాటు మీద పన్నీరు దృష్టి పెట్టడం గమనార్హం.

సీనియర్‌ నేతలు ఆయా ప్రాంతాల వారీగా కమిటీలకు తగ్గ జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అన్నాడీఎంకే వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ముందు వివాదంలో ఉన్న దృష్ట్యా, కమిటీ ఏర్పాటు, ప్రకటనకు అనుమతి కోరే పనిలో పన్నీరు శిబిరం ఉంది. ఆ శిబిరానికి చెందిన ఎంపీ మైత్రేయన్‌తో పాటుగా కొందరు సీనియర్లు ఢిల్లీలో తిష్టవేసి ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించి, కమిటీలను ప్రకటించుకునేందుకు తగ్గ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం బట్టి చూస్తే, రాష్ట్రపతి ఎన్నికల అనంతరం పన్నీరు సెల్వం మరింత దూకుడు పెంచినా పెంచే అవకాశాలు ఎక్కువే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement