కమల్ కాచుకో!
⇒ కమల్‌హాసన్ విమర్శలపై ఆగ్రహం
⇒ కేసువేస్తామని మంత్రుల హెచ్చరిక
⇒ దమ్ముంటే నాపై కేసు పెట్టండని స్టాలిన్ సవాల్
ఎడపాడి ప్రభుత్వంపై నటుడు కమల్‌హాసన్ చేసిన విమర్శలు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పరువునష్టం దావా వేస్తాం జాగ్రత్త అంటూ కమల్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే కమల్‌కు అన్నాడీఎంకేలోని పన్నీర్‌సెల్వం వర్గం సహా అన్ని పార్టీలూ అండగా నిలిచాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రభుత్వంపై నటుడు కమల్‌హాసన్ విమర్శలు, మంత్రుల ప్రతి విమర్శలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.జయ హయాంలో కమల్‌హాసన్ తీవ్రస్థాయిలో రాజకీయ వేధింపులకు గురయ్యారు. తాను నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రంలో ఒక సామాజికవర్గాన్ని కించపరుస్తూ చిత్రీకరించారనే కారణం చూపి విడుదలకు విఘాతం కల్పించారు.
ఈ చర్యలతో విసిగిపోయిన కమల్ దేశాన్ని విడిచిపోతానని ప్రకటించారు. ఆ తరువాత వెనుకడుగు వేసిన ప్రభుత్వం విడుదలకు మార్గం సుగమం చేసింది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులకు గురైన కమల్ జయ మరణించిన తరువాత తరచూ రాజకీయ విమర్శలను చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఎడపాడి ప్రభుత్వం అవినీతిమయమని ఇటీవల మీడియా ముందు దుమ్మెత్తిపోశారు. కమల్ విమర్శలతో ఉలిక్కిపడిన మంత్రులు కమల్‌పై తిట్ల దండకం అందుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని సైతం అసభ్య పదజాలంతో విమర్శించారు.
కమల్ విమర్శలతో అధికారపక్షం ఒకవైపు, విపక్షం మరోవైపుగా మారాయి. తమ ప్రభుత్వంపై కమల్ ఇలాగే విమర్శిస్తూ పోతే పరువునష్టం దావా వేస్తామని మంత్రి కడంబూరు రాజా హెచ్చరించారు. కమల్‌కు రాజకీయాలు మాట్లాడే హక్కులేదని మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. డబ్బు, ఆదాయం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి అని కమల్‌ను ఎద్దేవా చేశారు. కమల్ విమర్శలకు తగిన సమాధానం చెబుతున్నామని, ధైర్యం ఉంటే రాజకీయాల్లోకి వచ్చి ఈ విమర్శలు చేయాలని మంత్రి జయకుమార్ సవాల్ విసిరారు. ప్రతి ఒక్క ఓటరులో ఒక నేత ఉన్నాడు, ఈ వాస్తవాన్ని విస్మరించిన వాడు నేతగా కొనసాగలేడు అని నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు.
కమల్‌కు ప్రతిపక్షాల బాసట
జయ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగడంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు కమల్ చేసిన విమర్శలను సమర్థించాయి. మంత్రులంతా కమల్‌పై దుమ్మెత్తిపోయడాన్ని అడ్డుకుంటూ బాసటగా నిలిచాయి. ‘నేను సైతం అనేక విమర్శలు చేశాను, నాపై కూడా కేసు వేసే ధైర్యం ఉందా?’అని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. రాజకీయ నేతలేకాదు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుందని ఆయన అన్నారు. ఈ హక్కుతోనే కమల్ తనదైన శైలిలో విమర్శలు చేశారని చెప్పారు. విమర్శిస్తే కేసులు వేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన హితవు పలికారు.
ఐటీ దాడులు, కేసులు, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేమిటని ఆయన నిలదీశారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ సైతం కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మంత్రులను తప్పుపట్టారు. కమల్ విమర్శలను సావధానంగా విని ఓరిమితో తగిన బదులు చెప్పాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ భిన్నమైన ధోరణిలో స్పందించారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం మౌనంగా ఉండిన కమల్ అకస్మాత్తుగా రాజకీయ విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. జయ బతికున్నపుడు రాష్ట్రంలో అవినీతి లేదా అని ఆమె కమల్‌ను ప్రశ్నించారు.