Annadeyken
-
కమల్ కాచుకో!
⇒ కమల్‌హాసన్ విమర్శలపై ఆగ్రహం ⇒ కేసువేస్తామని మంత్రుల హెచ్చరిక ⇒ దమ్ముంటే నాపై కేసు పెట్టండని స్టాలిన్ సవాల్ ఎడపాడి ప్రభుత్వంపై నటుడు కమల్‌హాసన్ చేసిన విమర్శలు రాష్ట్రంలో తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయిందని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలతో మంత్రులు ఆగ్రహంతో ఊగిపోయారు. పరువునష్టం దావా వేస్తాం జాగ్రత్త అంటూ కమల్‌ను బహిరంగంగా హెచ్చరించారు. అయితే కమల్‌కు అన్నాడీఎంకేలోని పన్నీర్‌సెల్వం వర్గం సహా అన్ని పార్టీలూ అండగా నిలిచాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై : ప్రభుత్వంపై నటుడు కమల్‌హాసన్ విమర్శలు, మంత్రుల ప్రతి విమర్శలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.జయ హయాంలో కమల్‌హాసన్ తీవ్రస్థాయిలో రాజకీయ వేధింపులకు గురయ్యారు. తాను నటించి, దర్శకత్వం వహించిన విశ్వరూపం చిత్రంలో ఒక సామాజికవర్గాన్ని కించపరుస్తూ చిత్రీకరించారనే కారణం చూపి విడుదలకు విఘాతం కల్పించారు. ఈ చర్యలతో విసిగిపోయిన కమల్ దేశాన్ని విడిచిపోతానని ప్రకటించారు. ఆ తరువాత వెనుకడుగు వేసిన ప్రభుత్వం విడుదలకు మార్గం సుగమం చేసింది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులకు గురైన కమల్ జయ మరణించిన తరువాత తరచూ రాజకీయ విమర్శలను చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఎడపాడి ప్రభుత్వం అవినీతిమయమని ఇటీవల మీడియా ముందు దుమ్మెత్తిపోశారు. కమల్ విమర్శలతో ఉలిక్కిపడిన మంత్రులు కమల్‌పై తిట్ల దండకం అందుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని సైతం అసభ్య పదజాలంతో విమర్శించారు. కమల్ విమర్శలతో అధికారపక్షం ఒకవైపు, విపక్షం మరోవైపుగా మారాయి. తమ ప్రభుత్వంపై కమల్ ఇలాగే విమర్శిస్తూ పోతే పరువునష్టం దావా వేస్తామని మంత్రి కడంబూరు రాజా హెచ్చరించారు. కమల్‌కు రాజకీయాలు మాట్లాడే హక్కులేదని మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. డబ్బు, ఆదాయం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి అని కమల్‌ను ఎద్దేవా చేశారు. కమల్ విమర్శలకు తగిన సమాధానం చెబుతున్నామని, ధైర్యం ఉంటే రాజకీయాల్లోకి వచ్చి ఈ విమర్శలు చేయాలని మంత్రి జయకుమార్ సవాల్ విసిరారు. ప్రతి ఒక్క ఓటరులో ఒక నేత ఉన్నాడు, ఈ వాస్తవాన్ని విస్మరించిన వాడు నేతగా కొనసాగలేడు అని నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. కమల్‌కు ప్రతిపక్షాల బాసట జయ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగడంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు కమల్ చేసిన విమర్శలను సమర్థించాయి. మంత్రులంతా కమల్‌పై దుమ్మెత్తిపోయడాన్ని అడ్డుకుంటూ బాసటగా నిలిచాయి. ‘నేను సైతం అనేక విమర్శలు చేశాను, నాపై కూడా కేసు వేసే ధైర్యం ఉందా?’అని ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. రాజకీయ నేతలేకాదు ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుందని ఆయన అన్నారు. ఈ హక్కుతోనే కమల్ తనదైన శైలిలో విమర్శలు చేశారని చెప్పారు. విమర్శిస్తే కేసులు వేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన హితవు పలికారు. ఐటీ దాడులు, కేసులు, అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేమిటని ఆయన నిలదీశారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావళవన్ సైతం కమల్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మంత్రులను తప్పుపట్టారు. కమల్ విమర్శలను సావధానంగా విని ఓరిమితో తగిన బదులు చెప్పాల్సిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడటం సమంజసం కాదని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం అన్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ భిన్నమైన ధోరణిలో స్పందించారు. జయలలిత జీవించి ఉన్నంతకాలం మౌనంగా ఉండిన కమల్ అకస్మాత్తుగా రాజకీయ విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. జయ బతికున్నపుడు రాష్ట్రంలో అవినీతి లేదా అని ఆమె కమల్‌ను ప్రశ్నించారు. -
పన్నీరు దూకుడు
⇒ కార్యవర్గానికి కసరత్తు ⇒ అనుమతి కోసం సీఈసీకి వినతి అన్నాడీఎంకేకి కొత్త జట్టును ప్రకటించుకునేందుకు తగ్గట్టుగా పురట్చి తలైవి శిబిరం నేత,మాజీ సీఎం పన్నీరు సెల్వం దూకుడు పెంచే పనిలో పడ్డారు. కార్యవర్గం కసరత్తుల్లో భాగంగా సీఈసీఅనుమతి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి, చెన్నై : రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ కార్యవర్గాల ఏర్పాటుపై పన్నీరు సెల్వం దృష్టి సారించారు. మరోవైపు పార్టీ కేడర్ తనవైపే ఉందని చాటుకునేందుకు ఉరకలు వేస్తున్నారు. అమ్మ జయలలిత మరణం తదుపరి అన్నాడీఎంకే ముక్కలైన విషయం తెలిసిందే. ప్రధానంగా అమ్మ, పురట్చి తలైవి శిబిరాల మధ్య అన్నాడీఎంకే కైవశం లక్ష్యంగా సమరం సాగుతోంది. శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నాడీఎంకే అమ్మ శిబిరాన్ని ఎదుర్కొని రెండాకుల చిహ్నం దక్కించుకునేందుకు మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని పురట్చి తలైవి శిబిరం తీవ్రంగానే కుస్తీ పడుతోంది. జయలలిత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా మధుసూదనన్, కోశాధికారిగా పన్నీరు సెల్వం, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పళని స్వామి వ్యవహరించే వాళ్లు. అయితే, అమ్మ మరణంతో మధుసూదనన్, పన్నీరు సెల్వం ఓవైపు ఉండగా, పళనిస్వామి మాత్రం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శిబిరం వైపు ఉన్నారు. దీన్ని అస్త్రంగా చేసుకుని, పార్టీకి నిజమైన నాయకత్వం తమదేనని చాటుకునేందుకు పన్నీరు శిబిరం తీవ్రంగా కసరత్తులు చేస్తూ వస్తున్నది. ఇప్పటికే లక్షల కొద్ది పేజీలు, వివిధ అంశాల్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అందించి ఉన్నారు. తామేమీ తక్కువ తిన్నామా..? అన్నట్టుగా అమ్మ శిబిరం సైతం తమ వద్ద ఉన్న ఆధారాలను ప్రమాణపత్రంగా సీఈసీకి అందించింది. ఈ పోరు ఓవైపు ఉంటే, మరోవైపు సీజ్ చేసిన రెండాకుల చిహ్నం కైవశం, ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా ప్రకటింపజేసుకుని, పార్టీ, ప్రభుత్వాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలన్న కాంక్షతో పన్నీరు సెల్వం తీవ్రంగానే ఉరకలు తీస్తున్నారు. కేడర్ తన వైపు ఉందని చాటుకునే దిశగా సాగుతున్న పన్నీరు సెల్వం బహిరంగ సభలకు మంచి స్పందనే వస్తుండటం గమనార్హం. పన్నీరు దూకుడు మరింతగా దూకుడు పెంచిన పన్నీరు సెల్వం, తన నేతృత్వంలో అన్నాడీఎంకే కమిటీని ప్రకటించేందుకు కసరత్తుల్లో పడ్డారు. అమ్మ శిబిరం వెంట గతంలో నియమించిన కమిటీలు ఉన్నా, పురట్చి తలైవి శిబిరానికి అంటూ ప్రత్యేకంగా కార్యవర్గం లేదు. దీంతో అన్నాడీఎంకే తమ శిబిరానిదేనని చాటుకునే రీతిలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పార్టీ, అనుబంధ విభాగాల కార్యవర్గాల ఏర్పాటు మీద పన్నీరు దృష్టి పెట్టడం గమనార్హం. సీనియర్ నేతలు ఆయా ప్రాంతాల వారీగా కమిటీలకు తగ్గ జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, అన్నాడీఎంకే వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు వివాదంలో ఉన్న దృష్ట్యా, కమిటీ ఏర్పాటు, ప్రకటనకు అనుమతి కోరే పనిలో పన్నీరు శిబిరం ఉంది. ఆ శిబిరానికి చెందిన ఎంపీ మైత్రేయన్‌తో పాటుగా కొందరు సీనియర్లు ఢిల్లీలో తిష్టవేసి ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బుధవారం వినతి పత్రం సమర్పించి, కమిటీలను ప్రకటించుకునేందుకు తగ్గ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం బట్టి చూస్తే, రాష్ట్రపతి ఎన్నికల అనంతరం పన్నీరు సెల్వం మరింత దూకుడు పెంచినా పెంచే అవకాశాలు ఎక్కువే. -
టీటీవీ దూకుడు
► మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు ► నలుగురు మంత్రులపై వేటుకు పట్టు ► నేను ఎవ్వరికీ శత్రువుని కాను: దినకరన్ వ్యాఖ్య సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో టీటీవీ స్వరం పెరుగుతోంది. ఉప ప్రధాన కార్యదర్శికి మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు కదిలారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఏకంగా పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలోనే ఉండాలన్న నినాదంతో టీటీవీకి మద్దతుగా స్పందించారు. అలాగే, టీటీవీకి వ్యతిరేకంగా స్పందిస్తున్న నలుగురు మంత్రుల్ని పదవుల నుంచి తక్షణం తొలగించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ జైలు జీవితం అనంతరం స్వరాన్ని పెంచారు. బెయిల్ మీద శనివారం చెన్నైలో అడుగుపెడుతూ, వచ్చేస్తున్నా... పార్టీ వ్యవహారాల మీదే ఇక దృష్టి అని ప్రకటించారు. బహిష్కృత నేతకు పార్టీలో ఇక, పని ఏమిటంటూ స్పందించే వాళ్లూ ఆ శిబిరంలో పెరిగారు. అదే సమయంలో తనను ఎవరు తొలగించారు... తొలగించే అధికారం చిన్నమ్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు తప్ప,..మరెవ్వరికీ లేదంటూ దినకరన్ స్పందించడం ఆ శిబిరంలో ఉత్కంఠను రేపింది. తన స్వరాన్ని పెంచుతూ టీటీవీ దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారు. దీంతో ఆయనకు మద్దతుగా అమ్మ శిబిరంలో కదిలే వాళ్లు పెరుగుతున్నారు. ఇన్నాళ్లు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు టీటీవీ గొడుగు నీడకు చేరే పనిలో పడ్డారు. ఆదివారం 20 మంది ఎమ్మెల్యేలు టీటీవీతో భేటీ సంకేతాలు చర్చకు దారి తీశాయి. ఇందులో ఎమ్మెల్యేలు బోసు, తంగ తమిళ్ సెల్వన్, సుబ్రమణియన్, ఎంపీ నాగరాజ్ అయితే, మరింత దూకుడు పెంచారు. పళనికి వ్యతిరేకంగా, టీటీవీకి మద్దతుగా బహిరంగంగానే స్పందించడం గమనార్హం. పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలోనే ఉండాలని వ్యాఖ్యానిస్తూ, ఇందుకు సమర్థుడు దినకరన్ అన్న నినాదాన్ని అందుకోవడం గమనించాల్సిన విషయం. అలాగే, దినకరన్‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి స్పందిస్తున్న నలుగురు మం త్రుల్ని పదవి నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మరి కొందరు మద్దతుదారులు నినాదాన్ని అందుకున్నారు. ఈ మంత్రుల్లో జయకుమార్, సెంగోట్టయన్, తంగమణి, ఎస్పీ వేలుమణి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. ఇక, టీటీవీ మద్దతుదారుల నోళ్లకు తాళం వేస్తూ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, ఎంపీ తంబిదురై పేర్కొంటూ, పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలో అన్నది గతం అని, ఇక, అందుకు ఆస్కారం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. అమ్మ జయలలిత చేతిలో ఉన్నప్పుడు ఆనందించామని, చిన్నమ్మ వస్తారని ఎదురు చూశామని, అయితే, ఇక, ఆ చాన్స్ మరెవ్వరికీ ఉండబోదని స్పష్టం చేశారు. సీఎం పళనిస్వామి పాలన తీరు అభినందనీయమని కొనియాడడం గమనించాల్సిన విషయం. నేను ఎవరికీ శత్రువుని కాను : మద్దతుదారుల నినాదం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వూ్యలో టీటీవీ దినకరన్ స్పందించారు. తాను ఎవ్వరికీ శత్రువును కాను అని, శత్రువుల్ని కూడా మిత్రులుగానే తాను చూస్తానని వ్యాఖ్యానించారు. రెండాకుల చిహ్నం పరిరక్షణ, పార్టీ బలోపేతం లక్ష్యంగా విలీనం నినాదం తెర మీదకు వచ్చిన సమయంలో ఓ మూలన ఒదిగి ఉంటాననే అర్థంతో తాను ఇది వరకు స్పందించడం జరిగిందన్నారు. అంతే గానీ, పార్టీ నుంచి తాను తప్పుకున్నట్టు కాదు అని, తనను తప్పించే అధికారం ఎవ్వరికీ లేదని, తనను తప్పించాలంటే, ఆ అధికారం ఒక్క ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కొందరు మిత్రులు విలీన నినాదంతో చేసిన వ్యాఖ్యలను నిశితంగానే పరిశీలించానని, అయితే, వాళ్లు ఒరగబెట్టిందెమిటోనని నలుగురు మంత్రుల్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ పరిరక్షణ, బలోపేతం లక్ష్యంగా తాను మళ్లీ రంగంలోకి దిగుతున్నానని, కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నట్టు తెలిపారు. పార్టీలో ఉన్న వారందరూ దివంగత నేతల ఆశయ సాధన లక్ష్యంగా శ్రమిస్తున్న వాళ్లేనని, అందరూ పార్టీ సేవకులేనని పేర్కొన్నారు. పార్టీలో తనను ఎవరూ ఏమి చేయలేరని, అనలేరని, ఎవరినీ ఎదురు చూడడం లేదని, చిన్నమ్మ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, ముందుకు సాగబోతున్నట్టు తెలిపారు. ఇక, అమ్మ శిబిరంలో సాగుతున్న పరిణామాలపై అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ, శశికళ నియామకమే చెల్లనప్పుడు, ఇక, దినకరన్ నియామకం ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ఎవరు పార్టీని నడిపించాలోనన్నది కేడర్ తేలుస్తారని వ్యాఖ్యానించారు. -
అప్పుల ఊబిలో తమిళనాడు
► గత ఆరు సంవత్సరాల్లో 3.14 లక్షల కోట్లు ఆప్పు చేశారని ఆరోపణ ► రాష్ట్ర ఆదాయంలో సగం వడ్డీకే ► మరో రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరన్న రాందాస్ తిరువళ్లూరు: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గత ఆరు సంవత్సరాల్లో 3.14 లక్షల కోట్లు అప్పులు పెరిగాయని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్ ఆరోపించారు. తిరువళ్లూరులో పీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సమావేశం పార్టీ రాష్ట్ర ఉపకార్యదర్శి బాలయోగి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా మాజీ కన్వీనర్ వెంకటేషన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దినేష్కమార్ ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్, విశిష్ట అతిథిగా మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించడంలో డీఎంకే ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రస్తుతం అన్నాడీఎంకే నేతలకు రాజకీయ వ్యవహారాలు నడపడానికే సమయం లేకుండా పోయిందని విమర్శించారు. అవినీతిమయంగా రాష్ట్రాన్ని మార్చేసిన ద్రవిడ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అనంతరం రాందాస్ మాట్లాడుతూ పీఎంకే తీసుకున్న ముందు చూపుతో రాష్ట్రంలోని 90 వేల మద్యం దుకాణాలు, రాష్ట్రంలోని మూడు వేలకు పైగా మద్యం దుకాణాలు మూతపడ్డాయని, మద్యపాన నిషేధం విషయంలో రాజీ లేనీ పోరాటాన్ని సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఆరు సంవత్సరాల కాలంలో పెచ్చు మీరిన అవినీతితో 85 వేల కోట్లు రూపాయల పెట్టుబడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిందని ఆరోపించారు. దక్షిణ కొరియాకు చెందిన కియా కారు విడిభాగాల తయారీ పరిశ్రమను పెట్టడానికి ముందుకు వస్తే, మంత్రులు, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అడిగి లంచం మొత్తాన్ని ఇవ్వలేక పొరుగు రాష్ట్రానీకి వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ తమిళనాడులో ఏర్పాటు చేసి ఉంటే దాదాపు ఐదు వేల మందికి ఉపాధి లభించేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాక ముందు లక్ష కోట్లు రూపాయలు అప్పు ఉండగా ప్రస్తుతం 5.30 లక్షల కోట్లుకు పెరిగిందని, ఈ మొత్తానికి ఏడాదికి 23 వేల కోట్లు రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. రాష్ట్ర ఆదాయంలో ఇంత మొత్తం వడ్డీ పోతే ఇక సంక్షేమం సంగతేంటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో రైతుల ఆత్మహత్యలు లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు నెలల కాలంలో దాదాపు నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, కరువు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని 40 వేల కోట్లు రూపాయలు కరువు, రైతుల పరిహరం కోసం ఎందుకు అడిగారని వారు ప్రశ్నించా రు. అవినీతి లేనీ పాలన అందించడానికి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అద్యక్షుడు జీకే మణి, పార్టీ నేతలు వైద్యలింగం, అంబత్తూరు కేఎన్ శేఖర్, అడ్వొకేట్ బాలుతో పాటు వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.