టీటీవీ దూకుడు
► మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు
► నలుగురు మంత్రులపై వేటుకు పట్టు
► నేను ఎవ్వరికీ శత్రువుని కాను: దినకరన్ వ్యాఖ్య
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అమ్మ శిబిరంలో టీటీవీ స్వరం పెరుగుతోంది. ఉప ప్రధాన కార్యదర్శికి మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు కదిలారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఏకంగా పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలోనే ఉండాలన్న నినాదంతో టీటీవీకి మద్దతుగా స్పందించారు. అలాగే, టీటీవీకి వ్యతిరేకంగా స్పందిస్తున్న నలుగురు మంత్రుల్ని పదవుల నుంచి తక్షణం తొలగించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ జైలు జీవితం అనంతరం స్వరాన్ని పెంచారు.
బెయిల్ మీద శనివారం చెన్నైలో అడుగుపెడుతూ, వచ్చేస్తున్నా... పార్టీ వ్యవహారాల మీదే ఇక దృష్టి అని ప్రకటించారు. బహిష్కృత నేతకు పార్టీలో ఇక, పని ఏమిటంటూ స్పందించే వాళ్లూ ఆ శిబిరంలో పెరిగారు. అదే సమయంలో తనను ఎవరు తొలగించారు... తొలగించే అధికారం చిన్నమ్మ, పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు తప్ప,..మరెవ్వరికీ లేదంటూ దినకరన్ స్పందించడం ఆ శిబిరంలో ఉత్కంఠను రేపింది. తన స్వరాన్ని పెంచుతూ టీటీవీ దూకుడు ప్రదర్శించే పనిలో పడ్డారు. దీంతో ఆయనకు మద్దతుగా అమ్మ శిబిరంలో కదిలే వాళ్లు పెరుగుతున్నారు. ఇన్నాళ్లు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు టీటీవీ గొడుగు నీడకు చేరే పనిలో పడ్డారు. ఆదివారం 20 మంది ఎమ్మెల్యేలు టీటీవీతో భేటీ సంకేతాలు చర్చకు దారి తీశాయి.
ఇందులో ఎమ్మెల్యేలు బోసు, తంగ తమిళ్ సెల్వన్, సుబ్రమణియన్, ఎంపీ నాగరాజ్ అయితే, మరింత దూకుడు పెంచారు. పళనికి వ్యతిరేకంగా, టీటీవీకి మద్దతుగా బహిరంగంగానే స్పందించడం గమనార్హం. పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలోనే ఉండాలని వ్యాఖ్యానిస్తూ, ఇందుకు సమర్థుడు దినకరన్ అన్న నినాదాన్ని అందుకోవడం గమనించాల్సిన విషయం. అలాగే, దినకరన్‌కు వ్యతిరేకంగా మొదటి నుంచి స్పందిస్తున్న నలుగురు మం త్రుల్ని పదవి నుంచి తప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మరి కొందరు మద్దతుదారులు నినాదాన్ని అందుకున్నారు. ఈ మంత్రుల్లో జయకుమార్, సెంగోట్టయన్, తంగమణి, ఎస్‌పీ వేలుమణి ఉండడం ఆలోచించ దగ్గ విషయం.
ఇక, టీటీవీ మద్దతుదారుల నోళ్లకు తాళం వేస్తూ, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్, ఎంపీ తంబిదురై పేర్కొంటూ, పార్టీ, ప్రభుత్వం ఒకరి చేతిలో అన్నది గతం అని, ఇక, అందుకు ఆస్కారం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. అమ్మ జయలలిత చేతిలో ఉన్నప్పుడు ఆనందించామని, చిన్నమ్మ వస్తారని ఎదురు చూశామని, అయితే, ఇక, ఆ చాన్స్ మరెవ్వరికీ ఉండబోదని స్పష్టం చేశారు. సీఎం పళనిస్వామి పాలన తీరు అభినందనీయమని కొనియాడడం గమనించాల్సిన విషయం.
నేను ఎవరికీ శత్రువుని కాను :
మద్దతుదారుల నినాదం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంట ర్వూ్యలో టీటీవీ దినకరన్ స్పందించారు. తాను ఎవ్వరికీ శత్రువును కాను అని, శత్రువుల్ని కూడా మిత్రులుగానే తాను చూస్తానని వ్యాఖ్యానించారు. రెండాకుల చిహ్నం పరిరక్షణ, పార్టీ బలోపేతం లక్ష్యంగా విలీనం నినాదం తెర మీదకు వచ్చిన సమయంలో ఓ మూలన ఒదిగి ఉంటాననే అర్థంతో తాను ఇది వరకు స్పందించడం జరిగిందన్నారు. అంతే గానీ, పార్టీ నుంచి తాను తప్పుకున్నట్టు కాదు అని, తనను తప్పించే అధికారం ఎవ్వరికీ లేదని, తనను తప్పించాలంటే, ఆ అధికారం ఒక్క ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
కొందరు మిత్రులు విలీన నినాదంతో చేసిన వ్యాఖ్యలను నిశితంగానే పరిశీలించానని, అయితే, వాళ్లు ఒరగబెట్టిందెమిటోనని నలుగురు మంత్రుల్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ పరిరక్షణ, బలోపేతం లక్ష్యంగా తాను మళ్లీ రంగంలోకి దిగుతున్నానని, కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నట్టు తెలిపారు. పార్టీలో ఉన్న వారందరూ దివంగత నేతల ఆశయ సాధన లక్ష్యంగా శ్రమిస్తున్న వాళ్లేనని, అందరూ పార్టీ సేవకులేనని పేర్కొన్నారు.
పార్టీలో తనను ఎవరూ ఏమి చేయలేరని, అనలేరని, ఎవరినీ ఎదురు చూడడం లేదని, చిన్నమ్మ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, ముందుకు సాగబోతున్నట్టు తెలిపారు. ఇక, అమ్మ శిబిరంలో సాగుతున్న పరిణామాలపై అన్నాడీఎంకే పురట్చి తలైవి శిబిరం నేత, మాజీ సీఎం పన్నీరు సెల్వం స్పందిస్తూ, శశికళ నియామకమే చెల్లనప్పుడు, ఇక, దినకరన్ నియామకం ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. ఎవరు పార్టీని నడిపించాలోనన్నది కేడర్ తేలుస్తారని వ్యాఖ్యానించారు.