
సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నా డీఎంకే కొత్త వార్తా చానల్‌ను బుధవారం ప్రారంభించింది. పార్టీ మాజీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత పేరుమీదుగా ఈ కొత్త చానల్‌కు ‘న్యూస్ జే’ అని పేరుపెట్టారు. గతంలోనూ అన్నాడీఎంకే పార్టీకి ‘జయ టీవీ’ చానల్ ఉండగా, జయలలిత మరణం తర్వాత అది పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ వర్గం చేతుల్లోకి వెళ్లింది.
గతంలో జయలలిత స్థాపించిన దినపత్రిక ‘డాక్టర్ నమదు ఎంజీఆర్’ కూడా ప్రస్తుతం దినకరన్ వర్గం చేతుల్లోనే ఉంది. దీంతో పార్టీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ‘నమదు పురచ్చి తలైవి అమ్మ’ పేరుతో అన్నాడీఎంకే కొత్త పత్రికను కూడా తీసుకొచ్చింది. న్యూస్ జే ప్రారంభోత్సవానికి సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సహా పలువురు నేతలు హాజరయ్యారు. తమ ప్రభుత్వ విజయాల గురించి ప్రస్తుత చానళ్లు పెద్దగా కథనాలు ప్రసారం చేయడం లేదనీ, ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించి వాటిని ప్రజలకు చేరువ చేసేందుకే ఈ చానల్‌ను ప్రారంభిస్తున్నామని పళనిస్వామి చెప్పారు.