మంతనాలు
మంతనాలు
Published Fri, Mar 25 2016 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
తండ్రి కరుణతో అళగిరి భేటీ
తల్లిదండ్రుల
పరామర్శకేనని సమాధానం
పార్టీ పునఃప్రవేశమని ప్రచారం
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకే అధిష్టానంతో ఏర్పడిన విభేదాల కారణంగా పార్టీ నుంచి బహిష్కృతుడైన కరుణానిధి తనయుడు అళగిరి మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. తన తండ్రి కరుణానిధిని గురువారం కలుసుకోవడం ద్వారా ఎన్నికల వేళ అళగిరి ఏమి కిరి కిరికి సిద్ధమైనాడనే చర్చకు తెరలేపాడు.తన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్‌ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో డీఎంకే అధినేత కరుణానిధి నలిగిపోతున్నారు. కరుణ తదనంతరం పార్టీ పగ్గాలు ఎవరికనే అంశం కరుణ కుటుంబంలో రాజకీయ చిచ్చును రగిల్చింది.
పెద్ద కుమారుడైనందున తానే వారసుడినని అళగిరి, అంటిపెట్టుకుని చురుకైన రాజకీయాలు నడుపుతున్నందున తనకే పార్టీ పగ్గాలు అప్పగించాలని స్టాలిన్ పట్టుదలతో ఉన్నారు. పార్టీ దక్షిణ తమిళనాడు బాధ్యతలు నిర్వర్తిస్తున్న అళగిరి మధురైలో ఉండగా, పార్టీ కోశాధికారిగా చెన్నైలోనే నివాసం ఉంటున్న స్టాలిన్‌కు సహజంగానే కరుణానిధితో సాన్నిహిత్యం ఎక్కువ. కరుణానిధిని కలిసేందుకు వచ్చే డీఎంకే నేతలోపాటు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల అతిరథమహారథులతో సైతం స్టాలిన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి.
కరుణానిధితో సమానంగా పరిచయాలు స్టాలిన్ వారసత్వానికి కలిసొచ్చే అంశంగా మారింది. అలాగే స్టాలిన్ స్థాయిలో సమన్వయం, సంయమనం పాటించే స్వభావం అళగిరిలో లేదు. నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని నమ్ముతున్న కరుణానిధి పెద్ద, చిన్న కుమారులనే బేరీజు తావివ్వకుండా స్టాలిన్‌నే చేరదీయడం ప్రారంభించారు. ఈ పరిణామంతో పార్టీ కేడర్ దాదాపుగా స్టాలిన్ వెనుకే నడవడం ప్రారంభించింది. స్టాలిన్ ఆధిపత్యాన్ని సహించలేని అళగిరి తండ్రి కరుణతోనే కయ్యానికి కాలుదువ్వాడు.
తననే వారసుడిగా ప్రకటింపజేయాలని తల్లి చేత సిఫారసు చేయించుకున్నాడు. వారసత్వ ప్రకటనలో కరుణ మౌనం అళగిరిలో అసహనాన్ని పెంచింది. పార్టీపట్ల క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తూ అదుపు తప్పినట్లుగా ప్రవర్తిస్తున్న తీరును భరించలేని కరుణానిధి రెండేళ్ల క్రితం అళగిరిపై వేటువేశారు. పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తరవాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల సమయంలో డీఎంకేకు ఒక్కసీటు కూడా రాదని బహిరంగ ప్రకటనలు చేశాడు. పార్టీ అన్నా, తండ్రి కరుణానిధి అన్నా గౌరవమేనని మరో ప్రకటన చేయడం ద్వారా స్టాలిన్ అంటే మాత్రం గిట్టదని పరోక్షంగా చెప్పాడు. తండ్రిని కలిసేందుకు అళగిరి అనేక ప్రయత్నాలు చేయగా కరుణానిధి నిరాకరించారు.
మళ్లీ తెరపైకి:
డీఎంకే ప్రతిష్టను భ్రష్టుపట్టించడమే ధ్యేయంగా ప్రకటనలు సాగిస్తున్న అళగిరి అసెంబ్లీ ఎన్నిక ల నేపథ్యంలో అకస్మాత్తుగా కరుణానిధిని కలుసుకోవడం అందరినీ సంభ్రమాశ్చ్యర్యాలకు గురిచేసింది. గురువారం ఉదయం 11 గంటలకు గోపాలపురంలోని ఇంటికి వెళ్లి కరుణానిధిని కలుసుకున్నారు. కొద్దిసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎన్నికలపైనా, సీట్ల సర్దుబాటు గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్లు ప్రచారం జరిగింది. బయటనే వేచిఉన్న మీడియా ప్రతినిధులు మళ్లీ డీఎంకేలో చేరుతున్నారా అని ప్రశ్నించగా, పెద్దాయన క్షేమ సమాచారం విచారించేందుకు మాత్రమే వచ్చానని బదులిచ్చాడు.
అళగిరి మళ్లీ డీఎంకేలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో కరుణానిధితో భేటీ కావడం అన్నిపార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీ అధికార ప్రతినిధి ఇళంగోవన్‌ను ప్రశ్నించగా, ఈ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని సమాధానాన్ని దాటవేశారు. అళగిరి సోదరుడైన స్టాలిన్‌ను ప్రశ్నించగా, తన తల్లిదండ్రులను కలిసేందుకు వచ్చి వెళ్లాడు ఇందులో రాజకీయం ఏముంటుందని వ్యాఖ్యానించారు. గతంలో నిరాకరించిన కరుణానిధి నేడు అళగిరిని కలిసేందుకు అనుమతించడంతో ఎవరెన్ని రకాలుగా దాటవేసినా వారిద్దిరి భేటీ రాజకీయంతో కూడుకున్నదేనని విశ్వస్తున్నారు.
Advertisement