ట్రాన్స్‌ఫార్మర్‌పై ఎక్కి కూర్చుని ఉన్న జేమ్స్
తమిళనాడు, సేలం: మందుబాబులకు మద్యంతో పాటు మరికొన్ని అలవాట్లు ఉండడం చూస్తుంటాం. అటువంటి వారిలో కొందరు మద్యం సేవించినప్పుడు డ్యాన్స్ చేయడం, పాటలు పాడుతుంటారు. మరికొందరు ఎవరో ఒకరిపై కయ్యానికి కాలుదువ్వి గొడవలకు దిగుతుంటారు. అయితే సేలంలో సూరమంగళంలోని ఓ మందుబాబు మద్యం సేవించాడంటే కాలు కింద నిలవదట. ఎత్తయిన గోడలు, ట్యాంకర్ లారీలు వంటి వాటిపైకి ఎక్కి కూర్చుంటాడట. అసలు విషయానికి వస్తే.. సేలం సూరమంగళం సమీపంలోని జాగీర్ అమ్మాపాళయం ప్రాంతానికి చెందిన వ్యక్తి జేమ్స్ (60) మంగళవారం ఉదయం 11.30 గంటల మద్యం సేవించాడు.
తర్వాత ధర్మానగర్‌లో ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఎక్కి కూర్చున్నాడు. అయితే, అదృష్టవశాత్తు అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ కోత కారణంగా కరెంటు లేదు. ఆ సమయంలో అటువైపు వెళుతున్నవారు జేమ్స్‌ను గమనించి వెంటనే విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్‌చేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వవద్దని విషయం తెలిపారు. తర్వాత జేమ్స్‌ను తిట్టి కిందకి లాగారు. ఇంతలో సమాచారం అందుకున్న సూరమంగళం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. జేమ్స్‌కు మద్యం సేవించినప్పుడు గోడలు, ట్యాంకర్ లారీలు వంటి ఎత్తయిన వాటిపై ఎక్కి కూర్చునే అలవాటు ఉందని, ఆ విధంగానే మద్యం మత్తు ఎక్కువ కావడంతో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఎక్కినట్టు జేమ్స్ తెలిపాడు. అతడి మాటలు విని పోలీసులు విస్తుపోయారు. అనంతరం జెమ్స్‌ను హెచ్చరించి పంపించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment