సుజిత్ చిత్రపటం
రెండేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండిపోయాయి. నిరుపయోగంగా ఉన్న బోరు బావి ఆ బాలుడిని నిర్ధాక్షిణ్యంగా మింగేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. బోరుబావి నుంచి సుజిత్‌ను ఎలాగైనా ప్రాణాలతో బయటకు తీయాలని ఐదురోజుల పాటూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఆ బాలుడి మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున బయటకు తీశారు. సుజిత్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన తమిళనాడు ప్రజలు బాలుడి మరణవార్తతో తల్లడిల్లిపోయారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై : తిరుచ్చిరాపల్లి జిల్లా మనప్పారై సమీపం నడుకాట్టుపట్టికి చెందిన ఆరోగ్యరాజ్ (40), కళామేరి (35) దంపతులకు పునిత్ రోషన్ (5) సుజిత్ విల్సన్ (02) అనే ఇద్దరు కుమారులున్నారు. తమ ఇంటికి సమీపంలోని పెదనాన్న ఇంటికి తన అన్నతో కలిసి నడిచివెళుతూ ఈనెల 25వ తేదీన సుజిత్ బోరుబావిలోకి జారి పడిపోయాడు. మదురైకి చెందిన పదిమందితో కూడిన ప్రయివేటు బృందం బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది. 26 అడుగుల లోతుల్లో ఉండిన బాలుడు ఇంకా మరింత లోతులోకి వెళ్లకుండా ఎయిర్‌లాక్ విధానంలో ప్రకృతి వైపరీత్యాల నివారణ బృందం బాలుడి చేతులను కట్టివేసి పైకి లాగే ప్రయత్నం చేసింది. అయితే అంతలోనే బాలుడు జారిపోయాడు. బాలుడికి శ్వాససంబంధమైన సమస్య తలెత్తకుండా బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేశారు. బోరుబావికి సమాంతరంగా భారీ సొరంగాన్ని తవ్వడం ద్వారా బాలుడిని బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
బాలుడు పడిపోయిన నాటి నుంచి అవిశ్రాంతంగా రక్షణ చర్యలు కొనసాగాయి. సొరంగం పనులు వేగవంతం చేసేందుకు సోమవారం భారీ రిగ్గును తెప్పించారు. అయితే సుమారు 50 అడుగుల లోతులో బలమైన సున్నపురాయి అడ్డుతగలడంతో పనులు నిలిచిపోయాయి. అ తరువాత సహాయక బృందంలోని ఒక యువకుడు సొరంగంలోకి వెళ్లి బండరాయిని క్రేన్‌కు కట్టగా బయటకులాగడంతో అడ్డుతొలగింది. దీంతో సోమవారం రాత్రి మరలా సొరంగం పనులు ప్రారంభమైనాయి. ఇంతలో బోరుబావి నుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించా. బాలుడు సుజిత్ మరణించినట్లు రెవెన్యూ కార్యదర్శి రాధాకృష్ణన్ మంగళవారం తెల్లవారుజాము 2.30 గంటల సమయంలో అధికారికంగా ప్రకటించారు. తెల్లవారుజాము 4.30 గంటల సమయంలో ఆధునిక యంత్రంసాయంతో బోరుబావి నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి ప్రాణాలను హరించివేసిన బోరుబావిని వెంటనే కాంక్రీటుతో మూసివేశారు.
మిన్నంటిన రోదనలు..
సుజిత్ మరణించినట్లు ప్రకటన వెలువడగానే ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని బయటకు తీసిన సమయంలో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ ప్రజలు గుండెలవిసేలా రోదించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తమిళనాడు ప్రజలంతా సుజిత్ మరణవార్తతో కదిలిపోయారు. సుజిత్‌లా మరొకరు ప్రాణాలు కోల్పోకుండా ఇప్పటికైన జాగ్రత్తలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపారు. ఐదురోజులుగా సహాయక చర్యలకు అంకితమైన వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విజయభాస్కర్ సహా ప్రభుత్వ సిబ్బంది, కృషి చేసిన ఇతర బృందాలు కన్నీటి పర్యంతమయ్యారు. బోరుబావి నుంచి సుజిత్ ఏడుపులు ఇంకా వినిపిస్తున్నాయని మంత్రి విజయభాస్కర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోస్టుమార్టం ముగిసిన అనంతరం సుజిత్‌కు అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు.
సుజిత్ చిత్రపటం వద్ద సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం నివాళి
సీఎం సహా ప్రముఖుల సంతాపం..
సుజిత్ మృతికి సీఎం ఎడపాడి పళనిస్వామి సహా పలువురు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం మనప్పారై చేరుకున్న సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సహా పలువురు మంత్రులు సుజిత్ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. సుజిత్ మరణం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని ఎడపాడి పేర్కొంటూ బాలుడి కుటుంబానికి ప్రభుత్వం తరçఫున రూ.10 లక్షలు, అన్నాడీఎంకే తరఫున రూ.10లక్షలు సహాయం ప్రకటించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నివాళులర్పించారు.అలాగే డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ సైతం సుజిత్ సమాధి వద్ద నివాళులర్పించి పార్టీ తరపున రూ.10 లక్షలు సహాయం ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం సంతాపం ప్రకటించారు.
బోరుబావి వద్ద చిన్నారుల నివాళి
స్టాలిన్ విమర్శ–సీఎం ఆగ్రహం: ఇదిలా ఉండగా, రక్షింపు చర్యలను చేపట్టడంలో ప్రభుత్వ మెతకవైఖరి వల్లే సుజిత్ ప్రాణాలు కోల్పోయాడని డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ ఆక్షేపించారు. సుజిత్‌కి ఏర్పడిన కష్టం మరెవ్వరికీ రాకూడదని అన్నారు. మంత్రులు, అధికారులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో చూపిన శ్రద్ధ సహాయక చర్యల్లో చూపలేదని ఎద్దేవా చేశారు. బాలుడు 36 అడుగుల లోతులో ఉన్నపుడే సైనిక సహాయం కోరాల్సిందని అన్నారు. ఇలాంటి ఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
ఘాటుగా స్పందించిన సీఎం
సుజిత్‌ను రక్షించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏమిటో ప్రజలకు, ప్రపంచానికి తెలుసని, బాలుడి దారుణ మరణంలో సైతం రాజకీయలబ్ధికి పాకులాడవద్దని సీఎం ఎడపాడి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు హితవుపలికారు. బోరుబావి ప్రమాద సంఘటనల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన ఉదహరించారు. సుజిత్‌ను రక్షించే పనుల్లో అందరూ రేయింబవళ్లూ శ్రమించారు. ఆర్మీని రంగంలోకి దించి ఉండవచ్చుకదాని స్టాలిన్ అంటున్నారు, మరి డీఎంకే హయాంలో జరిగిన ప్రమాద సమయాల్లో ఆర్మీని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ముక్కొంబు ఆనకట్ట కూలిపోయినపుడు కూడా ఇలానే స్టాలిన్ విమర్శించారు. అయితే ముక్కొంబు పునరుద్ధరణ పనులను ఆర్మీనే ప్రశంసించిన సంగతి స్టాలిన్‌కు తెలియదా..? అని నిలదీశారు. తమిళనాడులో అందుబాటులో ఉన్న అన్నిరకాల సాంకేతిక నైపుణ్యాన్ని సుజిత్ రక్షింపు చర్యలకు వాడుకున్నామని సీఎం అన్నారు.
ప్రాణాలుపోతేగానీ చట్టాలు గుర్తుకురావా..?– మద్రాసు హైకోర్టు ఆగ్రహం
ప్రజలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతేగానీ చట్టాలు గుర్తుకు రావా..? అని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుజిత్ ప్రమాదం నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్‌కలాం సహాయకుడు పొన్‌రాజ్ ప్రజా ప్రయోజనవ్యాజం (పిల్)ను దాఖలు చేయగా, న్యాయమూర్తులు సత్యనారాయణన్, శేషసాయి ఈ పిల్‌ను మంగళవారం అత్యవసర కేసుగా స్వీకరించి విచారణ చేపట్టారు. ప్రతిసారీ ఏదో ఒక విపరీతం జరిగితేగానీ ప్రభుత్వంలో కదలికరాదా..? అని నిలదీశారు. నడిరోడ్డుపై బ్యానర్ కారణంగా ఇటీవల శుభశ్రీ అనే ఇంజినీరు దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. నేడు వినియోగంలో లేని బోరుబావి రెండేళ్ల బాలుడిని బలితీసుకుంది. శుభశ్రీ ఘటనతో బ్యానర్లపై నిషేధం వి«ధించారు, సుజిత్ ప్రమాదం తరువాత బోరుబావుల చట్టంపై దృష్టిపెట్టారని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇదిలా ఉండగా, సుజిత్ మరణంపై న్యాయవిచారణ జరపాలని సుప్రీంకోర్టులో జీఎస్ మణి అనే వ్యక్తి పిటిషన్ వేశారు.
సహాయక యంత్రం కనుగొంటే రూ.5 లక్షలు బహుమతి
బోరుబావుల్లో పడిపోయిన చిన్నారులను సురక్షితంగా బయటకు తీసే అత్యాధునిక యంత్రాలను కనుగొన్న వారికి రూ.5 లక్షలు బహుమతిగా అందజేస్తామని రాష్ట్ర ఐటీశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంతోష్‌బాబు ఫేస్‌బుక్‌లో పోస్టింగ్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment