చెన్నై, సాక్షి ప్రతినిధి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు మక్కళ్ పాదుగాప్పు కళగం అధ్యక్షులు ‘ట్రాఫిక్’ రామస్వామి ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు తమ అభ్యర్దులు పోటీ పడతారని శనివారం ఆయన తెలిపారు.రాష్ట్రంలో సామాజిక సేవకుడు ట్రాఫిక్ రామస్వామి పేరును వినని వారుం డరు. పండితుడి నుంచి పామరుని వరకు. ఉన్నతాధికారి నుంచి బికారి వరకు ట్రాఫిక్ రామస్వామి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పరిచితుడే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే వారిపై కేసులు బనాయించడం, రోడ్లలో అడ్డదిడ్డంగా వెలిసే హోర్టింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం ద్వారా సాధారణ రామస్వామి ట్రాఫిక్ రామస్వామిగా పేరుగాంచాడు. తన సామాజిక కార్యక్రమాల కోసం ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంటాడు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల బ్యానర్లు ఆయన ఆగ్రహాన్ని చవిచూసినవే. రామస్వామి రోడ్లపై తిరుగుతుంటే ఎక్కడ ఏమి చేస్తాడో అనే భయంతో పోలీసులకు కునుకుండదు. ఇటీవల రామస్వామిపై కేసులు బనాయించి జైల్లో పెట్టిన పోలీసులు కోర్టు నుంచి అక్షింతలు తిన్నారు. ట్రాఫిక్ అడ్డుతొలగింపులో రామస్వామికి ఇటీవల కోర్టు సానుభూతి సైతం లభించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రామస్వామి పేరు మార్మోగి పోయింది.
ఎన్నికలకు సన్నద్ధం: మక్కళ్ పాదుగాప్పు కళగం (ప్రజా సంరక్షణ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్న ‘ట్రాఫిక్’ రామస్వామి ఈ పేరుతోనే సామాజిక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశ్యం ఆయనకు లేదు. అయితే గత ఏడాది అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించడంతో అధికార పార్టీ నేతల అగ్రహానికి గురైనారు. తప్పుడు కేసు బనాయించి జైల్లోకి నెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలతో అన్నాడీఎంకేపై కసిపెంచుకున్న రామస్వామి ప్రతిపక్ష పార్టీలకు చేరువైనాడు. ఇటీవలి అర్కేనగర్ ఎన్నికల్లో రామస్వామి పోటీచేశాడు. ఇందుకు కొనసాగింపుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నాడు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొత్తం 234 స్థానాలకు తమ పార్టీ తరపున సామాజిక సేవాభిలాషులు పోటీలో నిలుస్తారని చెప్పారు. కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ మద్దతునిస్తే వారితో కలిసి నడిచేందుకు సిద్ధమేనని ట్రాఫిక్ రామస్వామి తెలిపారు.
అన్ని స్థానాల్లో పోటీ
Published Sun, Jul 19 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM
Advertisement
Advertisement