అంబులెన్సే ప్రాణాలు తీసింది
వారంతా మెడికల్ కళాశాల విద్యార్థులు. కష్టపడి చదివి ఎంసెట్ పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఎన్నో ఆశలతో మెడికల్ కళాశాలలో చేరారు. మరో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే డాక్టర్‌గా రాణించి తల్లిదండ్రులకు అండగా ఉండాలన్న వారి కళలు కలగానే మిగిలిపోయింది. ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలను చెన్నైలో జరుపుకుని బుధవారం ఉదయం తిరిగి క్లాసులకు హాజరవచ్చన్న ఆశతో బయలుదేరిన వారి ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది.
తిరువళ్లూరు: స్నేహితుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో మూడు కార్లులో బయలుదేరిన తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును 108 అంబులెన్‌స వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మెడికోలు దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో వైద్యశాలకు తరలించారు. ఆంధ్రా తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న వంశీ మంగళవారం బర్త్‌డే కావడంతో చెన్నైలో పుట్టినరోజును ఓ హోటల్‌లో జరుపుకుని మూడు కార్లలో 15 మంది మంగళవారం రాత్రి తిరుపతికి బయలుదేరారు.
ముందు వెళుతున్న కారులో సుదర్శన్(23), శివసాయికృష్ణ(23), జగదీష్(23), హరినాధ్(23), జ్యోతిస్వరూప్(23), ప్రణయ్(23) ప్రయాణిస్తున్నారు. తిరువళ్లూరు సమీపంలోని పుదూర్ వద్ద ఉన్న డీడీ నాయుడు మెడికల్ కళాశాల దాటి వెళుతుండగా తిరువళ్లూరు నుంచి తిరుత్తణి వైపు వెళుతున్న 108 అంబులెన్‌స మెడికోలు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు లో ప్రయాణిస్తున్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వీరిని పరిశీలించిన డాక్టర్‌లు సుదర్శన్, శివసాయికృష్ణ అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని అపోలో వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. స్వల్పంగా గాయపడిన 108 వాహన డ్రైవర్ మునిరత్నం సైతం చెన్నైకు తరలించారు.
మృతదేహాలకు శవపరీక్ష : మెడికోల మృతితో తిరువళ్లూరు జిల్లా వైద్యకేంద్రం వద్ద విషాదం నెలకొంది. తమతో కలిసి ప్రయాణించిన కారు తమ కళ్లెదుటే ప్రమాదానికి గురవడంతో పాటు ఇద్దరు మరణించిన సంఘటన సహచర మెడికోలను తీవ్రంగా కలిచివేసింది. ఇది ఇలా వుండగా శివసాయికృష్ణ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. సుదర్శన్ తల్లిదండ్రులు విదేశాల్లో ఉండడంతో అతని అత్త మామకు మృతదేహాన్ని అప్పగించారు. ప్రమాదంలో మృతి చెందిన సుదర్శన్‌ది వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట కాగా, శివసాయికృష్ణది తిరుపతిగా పోలీసుల విచారణలో నిర్ధారించారు.