
ఇక దేశవ్యాప్తంగా 'అమ్మ ఉప్పు'
అమ్మ క్యాంటీన్, అమ్మ వాటర్, అమ్మ సిమెంట్ తరహాలో కొత్తగా ప్రవేశ పెట్టిన అమ్మ ఉప్పు పథకాన్ని ఇకపై దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
డబుల్ ఫోర్టిఫైడ్, లో సోడియం, రిఫైన్డ్ ఫ్రీ ఫ్లో ఐయోడైస్డ్ వంటి పేర్లతో మూడు రకాల ఉప్పు ప్యాకెట్లను మార్కెట్ కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్న తమిళనాడు సాల్ట్ కార్పొరేషన్.. ఇకపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జయలలిత సర్కార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
జూన్ 21న ప్రారంభమైన అమ్మ ఉప్పు పథకం ద్వారా 5కేజీల నుంచి 20 కేజీల ఉప్పు ప్యాకెట్లను రూ. 14 నుంచి రూ. 25 ధరలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలోని అన్ని హోటళ్లు, ఆసుపత్రుల క్యాంటీన్లకు కూడా అమ్మ ఉప్పు పంపిణీ అయ్యేలా చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం. ఏఐఏడీఎంకే అధినేత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితను ఆమె అభిమానులు 'అమ్మ'గా ఆరాధించే సంగతి తెలిసిందే.