
భూసేకరణ చట్టానికి తూట్లు..
► సామాజిక ప్రభావ అంచనాకు మంగళం
► ప్రజాప్రయోజనాల సాకు..
► 80 శాతం రైతుల ఆమోదం నిబంధన తొలగింపు
► మళ్లీ తెరపైకి రైతులతో సంప్రదింపుల అంశం..
► రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచి పారిశ్రామికవే త్తలకు లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతులకు ప్రయోజనకరంగా ఉన్న 2013 భూసేకరణ చట్టంలోని సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని తొలగించి కొత్త భూసేకరణ చట్టం తెరపైకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు తేవాలని రాష్ట్ర మంత్రివర్గం శనివారం తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. కేబినెట్ ఆమోదించినందున ఇక ఈ చట్ట సవరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ఆమోదం అనంతరం చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఇది అమలవుతుంది. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు ప్రభుత్వం చాపకింద నీరులా ఏర్పాట్లు చేస్తోందంటూ 2016 జూన్ 6న, సెప్టెంబర్ 21 సాక్షి ప్రత్యేక కథనాలు ప్రచురించింది. తాజాగా కేబినెట్ నిర్ణయంతో సాక్షి కథనాలు అక్షర సత్యాలని తేలిపోయింది.
అతి ముఖ్యమైనది తొలగింపు
భూసేకరణవల్ల భూములు కోల్పోయే కుటుంబాలపై పడే సామాజిక ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయాలనేది 2013 భూసేకరణ చట్టంలో అతి ముఖ్యమైనది. 80 శాతం మంది రైతులు ఆమోదిస్తేనే భూసేకరణ అమలుచేయాలనే నిబంధన కూడా ఇందులో ఉంది. అయితే ప్రజాప్రయోజనాలు సాకుగా చూపించి ఈ సామాజిక ప్రభావ మదింపునకు మంగళం పలకాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం రక్షణ సంస్థలకు భూసేకరణకు మాత్రమే సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు ఉంది. అయితే ప్రజా అవసరాల పేరుతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారులు, భవనాలు, కాలువలు, విద్యా సంస్థలు, గృహాల నిర్మాణాలకు సేకరించే భూములకు సామాజిక ప్రభావ అంచనాను మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2013 భూసేకరణ చట్టానికి సవరణ ప్రతిపాదనల సమర్పణ బాధ్యతలను నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఇది సమర్పించిన నివేదికను రెవెన్యూ శాఖ న్యాయశాఖ అభిప్రాయం తీసుకుని కేబినెట్‌కు సమర్పించింది. దీనిని కేబినెట్ శనివారం ఆమోదించింది.
రైతుల ప్రయోజనాలు ఫణంగా పెట్టి...
రైతుల హక్కులను ఫణంగా పెట్టి పారిశ్రామిక సంస్థలకు మేలు చేకూర్చేలా ఈ సవరణలు ఉన్నాయి. గతంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సవరణలే చేసి రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకుంది. ఇదే తరహాలో గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకుని రైతుల పొట్టగొట్టేలా సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. దీని ప్రకారం పారిశ్రామిక కారిడార్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులు, రైల్వే మార్గాల ఇరువైపులా కిలోమీటరు పరిధిలో భూములను సేకరిస్తారు. భూములకు విలువ వచ్చినప్పుడు ఆ సంస్థలు ఆ భూములను వినియోగించుకుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌తో పాటు మౌలిక సదుపాయాలకు అవసరమైన భూముల సేకరణకు సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణకు కూడా సామాజిక ప్రభావ అంచనాను మినహాయింపు ఉంటుంది. మరోవైపు ఏ అవసరానికైనా భూములను సేకరించాలంటే ఆ భూములకు చెందిన రైతులు 80 శాతం అంగీకరించాలనే నిబంధన 2013 భూసేకరణ చట్టంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ నిబంధనను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రైతులతో సంప్రదింపుల ద్వారా మార్కెట్ ధరను చెల్లించి ఆయా జిల్లా కలెక్టర్లు భూములను తీసుకోవచ్చుననే నిబంధనను తాజా సవరణలో పేర్కొన్నారు. దీనిని కేబినెట్ ఆమోదించినందున త్వరలో అసెంబ్లీలో ప్రతిపాదిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.