గుంతలు.. గుంతలు
బెంగళూరులో 90 శాతం రహదారుల్లో నాణ్యత కరువు
క్యూసీఈ పరిశీలనలో తేలిన వైనం
ప్రభుత్వ ఖజానాకు రూ. వెయ్యి కోట్ల నష్టం
విచారణకు ఆదేశించిన లోకాయుక్త
బెంగళూరు : కొందరు అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కయ్యారు! దీంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో రోడ్లు నరక కూపాలుగా మారుతున్నాయి. 90 శాతం రహదారుల్లో నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాల్లో లేకపోవడం ఆయా దారుల్లో ప్రమాదాలు పెరుగుతుండటమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల నష్టం చేకూరిందని తేలింది. బీబీఎంపీలోని క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ (క్యూసీఈ) విభా గం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య నగరంలోని 189లోని రోడ్ల నాణ్యతను పరిశీలించగా అందులో 171 రోడ్లు నిర్ధిష్టం కంటే తక్కువ ప్రమాణాలు కలిగి ఉన్నాయని తేలింది. దీంతో చిన్నపాటి వర్షాలకే గుంతలు తేలడం, రోడ్డు వేసిన మూడు నెలల్లోపే సదరు రహదారి వాహన సంచారానికి అనువుగా లేకపోవడం వంటి విషయాలు వెలుగు చూస్తున్నాయని క్యూసీఈ తన నివేదికలో పేర్కొంది. అయితే రోడ్లు నిర్మించిన గుత్తేదార్లకు బిల్లులు చెల్లించివేశారని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయంలో అధికారులు, గుత్తేదారుల మధ్య కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది.
మరోవైపు నాణ్యత తక్కువగా ఉన్న రోడ్లలో వాహనదారులు ప్రయాణించడం వల్ల తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ కర్ణాటక జనహిత వేదిక స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సాయిదత్త లోకాయుక్తకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సాయిదత్త మాట్లాడుతూ... 2013-14 ఏడాది మధ్య బీబీఎంపీ పరిధిలో చేపట్టిన రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనుల్లో రూ.1,000 కోట్ల అక్రమాలు జరిగాయి. సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునేంతవరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించిన లోకాయుక్త రోడ్ల నిర్మాణం, నిర్వహణలో నాణ్యత తక్కువగా ఉండటానికి కారణాలు, ఇందుకు బాధ్యులు, వారిపై తీసుకున్న చర్యలు తదితర విషయాలపై వచ్చే జనవరి 7లోపు పూర్తి స్థాయి నివేదికను అందజేయాల్సిందిగా బీబీఎంపీకు లేఖ రాసినట్లు తెలిసింది.
క్యూసీఈ పరిశీలలో తేలిన కొన్ని వాస్తవాలు
దక్షిణ విభాగం : 42 రోడ్డు పనులు పరిశీలన, 32 పనుల్లో నాణ్యత కరువు
తూర్పు విభాగం : 21రోడ్డు పనులు పరిశీలన, అన్నింటిలోనూ నాణ్యత లేమి
పశ్చిమ విభాగం : 37 రోడ్డు పనుల్లో 32లో అంతే
మహాదేవపుర : 18 రోడ్డు పనుల్లో 14 నాణ్యత లేని స్థితి
దాసరహళ్లి : ఆరింటిలో నాలుగు పనుల్లో నాణ్యత లేని వైనం
రాజరాజేశ్వరి నగర్ : 20 రోడ్డు పనుల్లో 17