సమ్మె ప్రభావం
- నిలిచిన 360 తెలుగు రాష్ట్రాల బస్సు సర్వీసులు.....
- నిత్యం రూ.15 లక్షలు నష్టం
- దోచుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు
బెంగళూరు : ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ కార్మికుల సమ్మె కర్ణాటకలోని ప్రవాసాంధ్రులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ సర్వీసులు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు టికెట్టు ధరలను భారీగా పెంచేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఫిట్‌మెంట్‌పై స్పష్టతలేక ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు ఏవీ ఆయా డిపోల నుంచి బయటకు రావడం లేదు.
అందులో భాగంగానే బెంగళూరు డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కూడా నిలిచిపోయాయి. బెంగళూరు డిపో నుంచి నిత్యం తెలంగాణ ప్రాంతానికి (హైదరాబాద్)కు 36 సర్వీసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు 324 బస్సు సర్వీసులు ఉన్నాయి. రిజర్వేషన్ చేయించుకుని (బెంగళూరు నుంచి) సగటున ప్రతి నిత్యం 2వేల మంది ఇరు రాష్ట్రాల్లోని వారు ప్రయాణం చేస్తుంటారు. మరో ఆరు వేల మంది అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలో బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం రవాణా ఉద్యోగుల సమ్మె వల్ల బెంగళూరులోని తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలకు రోజుకు దాదాపు రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై బెంగళూరు డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంధ్ర మాట్లాడుతూ...‘బెంగళూరులో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా ఐదుగురు తప్ప మిగిలిన వారంతా సమ్మెలో ఉన్నారు. అందువ ల్లే బస్సులు నడపలేకపోతున్నాం. దీంతో రిజర్వేషన్ టికెట్ల రూపంలోనే రోజుకు రూ.10 లక్షల ఆదాయాన్ని కోల్పోతున్నాం.’ అని పేర్కొన్నారు.
దోచుకుంటన్న ప్రైవేటు ఆపరేటర్లు
వేసవి సెలవులతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ సమయంలో సాధారణం కంటే ఎక్కువ మంది బెంగళూరులోని రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తమ సొంత ఊళ్లకు వెలుతుంటారు. వీకెండ్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఐటీ రంగంలోని ఉద్యోగులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, నెల్లూరుకు వెళ్లడం పరిపాటి. అయితే ప్రభుత్వ స ర్వీసులు లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైలు, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.
బస్సులు లేకపోవడంతో అందుకు అనుగుణంగా రైల్వేశాఖ బోగీలనుకాని రైల్వే సర్వీసులను కాని పెంచలేదు. ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేటు ఆపరేటర్లు టిక్కెటు ధరలను రెట్టింపు ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా కూడా సంబంధిత ప్రైవేటు ఆపరేటర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి మెజెస్టిక్‌కు శుక్రవారం సాయంత్రం వచ్చిన సుప్రియా అనే ప్రయాణికురాలు వాపోయారు.