నేడు అప్పీలు
ఐదుగురు తమిళ జాలర్లకు కొలంబో కోర్టు ఉరిశిక్ష విధించిన కేసుపై సోమవారం అప్పీలు దాఖలు కానుంది. కోర్టు తీర్పుతో కుంగిపోయిన జాలర్ల కుటుంబాలు అప్పీలుపైనే ఆశలు పెట్టుకున్నాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి:పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశా ల నుంచి భారత్ అనేక సవాళ్లతో సతమతం అవుతుండగా, తమిళనాడు శ్రీలంక నుంచి గడ్డుపరిస్థితినే ఎదుర్కొం టోంది. శ్రీలంకలో ప్రత్యేక ఈలం కోరుతున్న తమిళుల డిమాండ్లకు తమిళనాడు ప్రజలు మద్దతుగా నిలవడంతో వైరం మొదలైంది. శ్రీలంక యుద్ధం సమయం లో అక్కడి సైనికులు వందలాది ఈలం తమిళుల మాన ప్రాణాలను హరిం చ డం, నిర్దయగా ఊచకోత కోయడం, వేలాది మందిని నిరాశ్రయులను చేయ డం వంటి పరిణామాలతో బద్దశత్రుత్వానికి దారితీసింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను యుద్ధోన్మాదిగా ఐక్యరాజ్యసమితి ముందు నిలబెట్టాలని తమిళనాడు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దీంతో తమిళ జాలర్లపై లంక కసి తీర్చుకుంటోంది.
సముద్రంలో చేపలవేటకు వెళ్లే తమిళ జాలర్లపై దాడులకు దిగడం, జైళ్లలోకి నెట్టడం, పడవలు ధ్వంసం చేయడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. సముద్రంలో చేపలవేట సాగిస్తున్న రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన ఐదుగురు జాలర్లు హెరాయిన్ రవాణా చేరవేస్తున్నారని అభియోగం మోపి, 2011 నవంబరు 28న శ్రీలంక గస్తీదళాలు అరెస్ట్ చేశాయి. 2012 మార్చి 21వ తేదీన దాఖలైన బెయిల్ పిటిషన్‌ను అదే ఏడాది జూన్ 11న కోర్టు కొట్టివేసింది. నాలుగేళ్లుగా ఐదుగురు జాలర్లు శ్రీలంక జైల్లోనే మగ్గుతున్నారు. అరుుతే వీరికి శ్రీలంక కోర్టు ఉరిశిక్ష విధిస్తూ గత నెల 30న తీర్పు చెప్పింది. ఉరిశిక్ష ఉదంతం తమిళనాడు ప్రజలను మరింత రెచ్చగొట్టింది. శ్రీలంక కు, భారత్‌లోని ఒక రాష్ట్రానికి (తమిళనాడు) మధ్య రోజు రోజుకూ పెరుగుతున్న వైరం కేంద్ర ప్రభుత్వ మెడకు చుట్టుకుంది. అధికార అన్నాడీఎంకే మొదలుకుని అన్ని పార్టీలు ఐదుగురు జాలర్లకు అండగా నిలిచాయి. అనేక సంఘాలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నాయి.
మోదీపై ఒత్తిడి
ఉరిశిక్ష పడిన ఐదుగురు జాలర్లు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించేలా శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయాన్ని ఆదేశించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. అంతేగాక అప్పీలుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెబుతూ రూ.20 లక్షలు మంజూరు చేసింది. తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడి, రాష్ట్ర బీజేపీ శాఖ రాయబారాలు, రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనలతో ఎట్టకేలకూ అంగీకరించిన కేంద్రం అప్పీలుకు మార్గం సుగమం చేసింది.
రైల్‌రోకో
శ్రీలంక కోర్టులో శిక్షపడిన ఐదుగురు జాలర్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ మక్కల్ ఇయక్కం వారు అదివారం రైల్‌రోకో చేపట్టారు. చెన్నై లోకల్ రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటల సమయంలో రైళ్లను ఆపివేసి పట్టాలపై బైఠాయించారు. 70 మంది నిరసనకారులను అరెస్ట్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అలాగే, అంబేద్కర్ న్యాయకళాశాల విద్యార్థులు సోమవారం తరగతులను బహిష్కరించి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.