రజనీతో హాలీవుడ్ సూపర్ స్టార్?
త్వరలో ఒక వండర్‌ఫుల్ మల్టీస్టారర్ చిత్రాన్ని సెల్యులాయిడ్‌పై ఎక్కించడానికి సన్నాహాలు జరుపుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అదేమిటన్నది చాలామందికి చాలా వరకు అర్థం అయ్యి ఉంటుంది. ఎస్ సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డెరైక్టర్ శంకర్ల కాంబినేషన్‌లో ఎందిరన్ 2 తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. వీరి కలయికలో ఇంతకు ముందు ఎందిరన్ చిత్రం రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
దీంతో ఆ చిత్రానికి సీక్వెల్ గురించి ఊహాగానాలు ఎప్పటి నుంచో మొదలైనా, ఎందిరన్ 2 కథను వండడంలో శంకర్ చాలా సీక్రెట్ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.అయితే ఈ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా ప్రీ ప్లాన్డ్‌గా జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రను సియాన్ విక్రమ్ పోషించనున్నారనే ప్రచారం ఇంతకు ముందు నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా ఇందులో బాలీవుడ్ భామ విద్యాబాలన్ రజనీకాంత్ సరసన నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
వీటన్నిటికీ మించిన అబ్బురపరచే అంశం ఏమిటంటే ఎందిరన్ 2లో ఇండియన్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోపాటు హాలీవుడ్ సూపర్‌స్టార్, కండలవీరుడు, టెర్మినేటర్ ఫేమ్ ఆర్నాల్డ్ నటించే అవకాశం ఉందన్నదే. ఐ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్నాల్డ్, శంకర్ దర్శకత్వంలో నటించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన అభిలాషను శంకర్ నెరవేర్చేపనిలో ఉన్నట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కే బ్రహ్మాండ చిత్రం ఎందిరన్ 2 అవుతుందని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.