ఎమ్మెల్యే కాశప్ప వ్యవహారంపై అట్టుడికిన ఉభయ సభలు
అరెస్ట్‌కు పట్టుబట్టిన బీజేపీ
శెట్టర్, సిద్ధు తీవ్ర వాగ్వాదం
స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యుల ఆందోళన
సభలు సోమవారానికి వాయిదా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక యూబీ సిటీలోని స్కై బార్‌లో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాగలకోటె జిల్లా హనగుంద ఎమ్మెల్యే విజయానంద కాశప్పనవర్ (కాంగ్రెస్)ను తక్షణమే అరెస్టు చేయాలని ప్రతిపక్ష బీజేపీ రెండో రోజు శుక్రవారమూ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ దశలో సభ్యులను శాంతింపజేయడానికి పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సోమవారానికి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే బీజేపీ సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎమ్మెల్యే ఆచూకీ గురించి ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. ఈ దశలో పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. మూడు సార్లు బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు.
ఒకానొక దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్‌ల మధ్య ఆవేశ పూరితంగా వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఈరోజు దీనిపై ప్రకటన చేస్తానని చెప్పిందని శెట్టర్ గుర్తు చేశారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక దీనిపై మాట్లాడతామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ప్రతిష్టంభన నెలకొంది. తొలుత బీజేపీ సభ్యుడు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఆచూకీ గురించి మీకేమైనా తెలుసా అంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు.
అనంతరం మాట్లాడిన శెట్టర్ ఇదో తలవంపుల సంఘటన అంటూ, తానేమీ తప్పు చేయలేదని చెబుతున్న ఎమ్మెల్యే ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారని నిలదీశారు. దీనిపై ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి, హోం మంత్రి, న్యాయ శాఖ మంత్రుల్లో ఎవరూ సభలో లేరని తెలిపారు. ఈ దశలో ప్రవేశించిన ముఖ్యమంత్రి బీజేపీపై ఎదురు దాడికి దిగారు.
మంత్రిగా ఉన్నప్పుడు హాలప్ప చేసిన పని, ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య కేసు, శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నీలి చిత్రాలు చూడడం లాంటి సంఘటలను ఉటంకించడంతో బీజేపీ సభ్యులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఎమ్మెల్యే విషయమై సమాధానం చెబుతామంటున్నా, ఎందుకు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ నిలదీశారు. ప్రశ్నోత్తరాలను జరగనీయండి, సభకు ఆటంకం కల్పించవద్దు అని కోరారు. ఈ సందర్భంగా శెట్టర్ ఆయనతో వాగ్వాదానికి దిగారు.
ఇదే సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ హయాంలో కొందరు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావించడంలో సభలో మళ్లీ అలజడి చెలరేగింది. మధ్యలో కాంగ్రెస్ సభ్యుడు రమేశ్ కుమార్ మాట్లాడుతూ ‘పార్టీలు అందరూ చేసుకుంటారు. విజయానంద అవివేకంగా ప్రవర్తించాడు. తగులుకోకుండా ఉండాల్సింది’ అని అనడంతో గందరగోళంలోనూ సభ్యులు నవ్వుకున్నారు. ఈ దశలో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే బీజేపీ సభ్యులు పట్టు వీడకుండా ధర్నాకు దిగారు.
శాసన మండలిలో..
పోలీసులపై ఎమ్మెల్యే విజయానంద దాడి చేశారన్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సభ్యులు శాసన మండలిలో శుక్రవారం ధర్నాను కొనసాగించారు. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వం నుంచి ప్రకటన చేయించాలని చైర్మన్ డీహెచ్. శంకరమూర్తిని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రకటన చేయిస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, ధర్నా విరమించలేదు.
ఈ సందర్భంగా పాలక ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభా నాయకుడు ఎస్‌ఆర్. పాటిల్ జోక్యం చేసుకుని, ప్రశ్నోత్తరాలను రద్దు చేసి, వేరే విషయాన్ని చేపట్టిన ఉదాహరణలు లేవని గుర్తు చేశారు. జేడీఎస్ నాయకుడు బసవరాజ హొరట్టి కూడా ప్రశ్నోత్తరాలకు అవకాశం కల్పించాలని బీజేపీ సభ్యులను కోరారు. చివరకు చైర్మన్ ప్రశ్నోత్తరాల తర్వాత హోం మంత్రితో ప్రకటన చేయిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రశ్నోత్తరాల అనంతరం సోమవారం ప్రకటన చేస్తానని హోం మంత్రి తెలపడంతో బీజేపీ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
రభస..
Published Sat, Jul 5 2014 3:42 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement