స్తంభించిన బ్యాంకింగ్
రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించిన బ్యాంకు ఉద్యోగులు
బెంగళూరు : చాలా కాలంగా అపరిృ్కతంగా ఉన్న వేతనాల పెంపు అంశంతో పాటు వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు మంగళవారం విధులను బహిష్కరించి సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. ఇక బెంగళూరులోని వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సైతం విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెలో పాల్గొన్న వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఉదయం టౌన్‌హాల్ నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగుల సంయుక్త వేదిక ప్రతినిధి ఏఎన్ కృష్ణమూర్తి మాట్లాడుతూ...2012 నవంబర్ తర్వాత వేతన సవరణ జరగలేదని తెలిపారు.
25 శాతం మేర వేతనాలను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుంటే ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) మాత్రం 11 శాతం మాత్రమే వేతనాలను పెంచుతామని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఐబీఏ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.