మీ హక్కులను గుర్తించండి | article on World consumer protection day | Sakshi
Sakshi News home page

మీ హక్కులను గుర్తించండి

Published Tue, Mar 14 2017 7:12 PM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

article on World consumer protection day

కాకినాడ లీగల్‌: కొనుగోలు చేసిన వుస్తువు, సేవల (ఆస్పత్రి, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సేవలు) పూర్తి స్థాయి ప్రయోజనం పొందే హక్కు వినియోగదారుల చట్టం-1986 ప్రకారం కొనుగోలుదారుడికి ఉంది. లోపాలున్నా, సమస్యలు ఏర్పడినా సంబంధిత సంస్ధ నష్టపరిహారం చెల్లించాలి. లేకుంటే వినియోగదారులఫోరాన్ని ఆశ్రయించవచ్చు.

ఫిర్యాదు చేయడం ఇలా...
నష్టపోయినవారు వినియోగదారులఫోరం హెల్ప్‌డెస్క్‌ సలహా మేరకు కేసు దాఖలు చేయవచ్చు. రసీదు కీలకం. ఆయా ఆధారాలతో కనీస రుసుము చెల్లించి ఫిర్యాదు చేయాలి.
–వ్యాపారి లేదా డీలరు ద్వారా సష్టపోతే ఫిర్యాదు చేయవచ్చు.
–వస్తువులో లేదా ఉత్పత్తిలో లోపాలు ఉన్నా, సేవల విషయంలో డీలర్లు ఆశ్రద్ధ చేసినా, అధిక ధర వసూలు చేసినా, మరే కారణాలతో నష్టపోయినా ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు.

నోటిసులో ఏం ఉండాలంటే...
–ఉత్పత్తి సర్వీస్‌ ప్రొవైడర్‌ లేక కంపెనీ చిరునామా రాయాలి.
–‘విషయం’లో ఫిర్యాదు ఇచ్చే ముందు నోటీసుగా పేర్కొనాలి.
–కొన్న వస్తువు లేదా సర్వీస్‌ వివరాలు ఇవ్వాలి. (క్యాష్‌ మెమో నంబరు, తేదీ).
–సంస్ధ ఇచ్చిన వారంటీ లేదా గ్యారంటీ వివరాలు తెలపాలి.
–వస్తువు లోపాన్ని, దానివల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను తెలపాలి.
–ఇబ్బందులపై ఎవరికి, ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారో తెలపాలి.
–స్పందించడానికి సంస్థకు 15–30 రోజుల గడువు ఇవ్వాలి.
–కొన్న వస్తువుకు పుల్‌ అమౌంట్‌ కోరితే దానికి 18 శాతం వరకూ వడ్డీ కూడా కోరవచ్చు.
–చివరిగా వినియోగదారుని పేరు, అడ్రస్‌ ఇవ్వాలి.

నోటీసు పంపే విధానం..
–పంపిన నోటీసు సంస్ధకు చేరినట్టు మీ వద్ద ఆధారం ఉండాలి.
–అందుకు నోటీసును అక్నాలెడ్జ్‌మెంట్‌ డ్యూ పోస్ట్, కొరియర్, హ్యాండ్‌ డెలివరీ విత్‌ ప్రూఫ్‌ పద్ధతుల్లో పంపవచ్చు. ఎలా పంపినా నోటీసు పంపినట్టు ఆధారం ఉండాలి. దానిని కోర్టులో ఇవ్వాలి.
–సదరు సమస్యపై చేసిన ప్రయత్నాలు, ఎవరెవరిని సంప్రదించారనే వివరాలను జిరాక్స్‌ పత్రాలుగా నోటీసుకు జత చేస్తే మంచిది.

ఫోరం పనితీరు...
నష్టం రూ.20 లక్షల వరకు అయితే జిల్లా వినియోగదారుల ఫోరంను, రూ.20లక్షల నుంచి రూ.కోటి వరకూ అయితే రాష్ట్ర ఫోరాన్ని ఆపైన అయితే ఢిల్లీలోని జాతీయ ఫోరాన్ని ఆశ్రయించాలి.

ఫీజు వివరాలు..
వినియోగదారుల ఫోరంలో కేసుకు రూ.లక్ష (వస్తువు విలువ) వరకు రూ.100, రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రూ.200, రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు రూ.400, రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల వరకు రూ.500 ఫీజు చెల్లించాలి. నేరుగా లేదా న్యాయవాది ద్వారా ఫోరంను ఆశ్రయించవచ్చు.

ఫోరం ఎక్కడ..
కాకినాడ, రాజమండ్రి కోర్టుల్లో జిల్లా ఫోరాలు ఉన్నాయి.

వినియోగదారుల బాధ్యత
–కొనుగోలు చేసే వస్తువుల పూర్తి సమాచారం తెలుసుకోవాలి.
–మోసపూరిత ప్రకటనలపై జాగ్రత్త వహించాలి
–నాణ్యతలో రాజీ వద్దు ఆఫర్ల విషయంలో పరిశీలన చేయాలి. ప్రతి కొనుగోలుకూ రసీదు, వారంటీపై సంతకం, స్టాంపు ఉండాలి.

హెల్ప్‌ డెస్క్‌ను ఉపయోగించుకోండి:
వినియోగదారుల ఫోరంలోని హెల్ప్‌డెస్క్‌ను ఆశ్రయిస్తే ఫిర్యాదు చేసే విధానాన్ని తెలియజేస్తారు. ఫిర్యాదు ఇచ్చి సెల్‌నంబర్‌ ఇస్తే కేసు వివరాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి.   - ఎస్‌ భాస్కరరావు,వినియోగదారుల ఫోరం మెంబర్‌

ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తాం..
వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వినియోగదారుల చట్టం గురించి గ్రామీణ ప్రజల్లో ఇంకా చైతన్యం రాలేదు. ప్రసార మాధ్యమాలు, స్వచ్ఛంద సంఘాలు ద్వారా గ్రామీణ ప్రజల వినియోగదారుల్ని చైతన్య పరిచేందుకు కృషి చేయాలి.          - ఎ. రాధాకృష్ణ, వినియోగదారుల ఫోరం, అధ్యక్షుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement