దాడిలో ‘అరుణాచల్’ ఎమ్మెల్యే కొడుకు మృతి
సాక్షి, న్యూఢిలీ: గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లో నివసించే 18 సంవత్సరాల ఈశాన్యరాష్ట్ర యువకుడు నిడో తనియం మరణం వివాదాస్పదంగా మారింది. తనియం తండ్రి, ఎమ్మెల్యే నిడో పవిత్ర అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. లజ్‌పత్‌నగర్‌లో బుధవారం కొంతమంది కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకే ఇతడు మరణించాడని కుటుంబసభ్యులు, నగరంలోని ఈశాన్యప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఇది కచ్చితంగా జాతివివక్షేనని, ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి తాము ప్రధానితో భేటీ అవుతామని ఈశాన్యరాష్ట్రాల ఎంపీలు ప్రకటించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోన్న నిడో తనియం జనవరి 29న లజజ్‌పత్‌నగర్‌లోని మిత్రుని ఇంటికి బయలుదేరాడు.
ఏ బ్లాక్‌లో నివసించే మిత్రుని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవడానికి అదే బ్లాకులోని ఓ మిఠాయి దుకాణంలో అడిగాడు. అందులో కూర్చున్న ఇద్దరు సోదరులు ఫర్మాన్, రిజ్వాన్ తన జుట్టును చూసి గేలి చేయడం నిడో తనియంకు కోపం తెప్పించింది. దాంతో ఫర్మాన్, రిజ్వాన్‌తో వాదనకు దిగాడు. కోపం ఆపుకోలేక దుకాణం గ్లాసును బద్దలుకొట్టాడు. దానితో ఫర్మాన్, రిజ్వాన్ , మరికొందరు కలిసి నిడోను చితకబాదారు. దెబ్బలు తిన్న నిడో పోలీసులు, తన మిత్రులకు ఫోన్ చే శాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మిత్రులు కూడా స్థానికులతో ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లి రాజీ కుదిర్చారు. పోలీసుల సూచన మేరకు తాము నిడోకు రూ.ఏడువేలు ఇచ్చామని రిజ్వాన్ చెప్పాడు. అయితే ఆ తరువాత పోలీసులు నిడోను దుకాణం వద్దకే తీసుకువచ్చి వదిలారు.
స్థానికులు అతణ్ని మరోమారు చితకబాదారని అతని మిత్రులు అంటున్నారు. మరునాడు ఉదయం గ్రీన్‌పార్క్ ఎక్స్‌టెన్షన్‌లోని గదిలో ఈ యువకుడి మృతదేహం కనిపించిందని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. దెబ్బల ధాటికే నిడో మరణించారని అంటున్నారు. రాజధానిలో తాము తరచూ ఇలా వివక్షకు గురవుతుంటామని ఈశాన్యప్రాంత వాసులు అంటున్నారు. తమ దుస్తులు, రూపురేఖల గురించి కొందరు నగరవాసులు అభ్యంతర వ్యాఖ్యలు చేస్తుంటారని ఆరోపించారు. నిడోపై దాడి జరిగిన దుకాణం ఎదుట శనివారం నిరసన జరపనున్నట్లు వారు చెప్పారు. పోలీసులు శుక్రవారం సాయంత్రం ఫర్మాన్‌ను ప్రశ్నించడానికి పిలిపించి అదుపులోకి తీసుకున్నారని రిజ్వాన్ తెలిపాడు. నిడో శరీరంపై బలమైన గాయాలున్నాయని డాక్టర్లు తెలిపారు. మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని దర్యాప్తు అధికారి ఒకరు చెప్పారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే : ఆప్
పోలీసుల తప్పిదం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆప్ ఆరోపించింది. స్టేషన్ నుంచి నిడోను వెనక్కి తీసుకొచ్చి మళ్లీ దుకాణం వద్దే దింపడంపై అనుమానాలు కలుగుతున్నాయని ఈ పార్టీ ప్రతినిధి దిలీప్ పాండే అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు.
బీజేపీ ఖండన
ఈశాన్య ప్రాంత యువకుడిపై దాడి చేసి చంపడాన్ని అనాగరిక, రాక్షస చర్యగా బీజేపీఅభివర్ణించింది. ఇలాంటి ఘటనలు జాతి సంక్షేమానికి ఎంతమాత్రమూ క్షేమకరం కావని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.
తక్షణం అరెస్టు చేయండి : సంజయ్
ఇటానగర్: నిడో హంతకులను తక్షణం అరెస్టు చేయాలని, ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా పోలీసులు స్పందించడం లేదని అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ టకమ్ సంజయ్ అన్నారు. ఢిల్లీలోని ఈశాన్యప్రాంత వాసులపై వివక్ష కొనసాగుతూనే ఉందని, గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఈశాన్యప్రాంత విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.