మణిపురి బాలికపై అత్యాచారం
Published Sat, Feb 8 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో ఈశాన్యరాష్ర్ట ప్రజలపై దౌర్జన్యకాండ నడుస్తోం ది. గత నెలాఖరులో అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి హత్య ఉదంతం ఢిల్లీలో ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే. కాగా, ఇదే సమయంలో మణిపురి బాలికపై అత్యాచారఘటన అగ్నికి ఆజ్యం పోసినట్ల య్యింది. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతం లో మణిపూర్‌కు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి కుటుం బం అద్దెకుండే ఇంటి యజమాని కుమారుడే (18) బాలికపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు.
నిందితుడు విక్కీని అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వసంత్‌విహార్ పోలీస్‌లు తెలిపారు. మునిర్కా ప్రాంతంలో ఈశాన్య ప్రాంతవాసులు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనే ఈ కుటుంబం అద్దెకుంటోంది. శుక్రవారం రాత్రి పదిన్నరకు బాలిక మందుల కోసం సమీప మందుల దుకాణానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. దారిలో విక్కీ ఆమెను అడ్డుకుని మందుల దుకాణానికి దగ్గరలో ఉన్న ఓ ఖాళీగదికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాలిక జరిగిన విషయం చెప్పగానే ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమెను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించగా ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. బాలికకు సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.
ఈ ఘటనను నిరసిస్తూ ఈశాన్య ప్రాంత వాసులు వసంత్ విహార్ పోలీస్‌స్టేషన్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థులు కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ కూడా బాలికపై అత్యాచారాన్ని ఖండించారు. ఆమె వసంత్ విహార్ పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. ఢిల్లీలో మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదని, గడచిన కొద్ది రోజుల్లో ఇది మూడవ ఘటన అని ఆమె చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా చేయడం కోసం పోలీసులపై ఒత్త్తిడి తెస్తామని ఆమె చెప్పారు. కాగా శనివారం సాయంత్రం ఆందోళనకారులకు పోలీసులు ఎఫ్‌రూ.ఆర్ కాపీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేయాలి: ఆప్
మణిపుర్ బాలిక మానభంగం కేసులో సంబంధిత ఏరియా పోలీస్‌స్టేషన్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆప్ డిమాండ్ చేసింది. నగరంలో పోలీసుల అసమర్ధత, అలక్ష్యం వల్లే మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతలు కేంద్రం చేతిలో ఉండటం వల్లే జాతీయ రాజధానిలో అరాచక శక్తుల ఆటలు సాగుతున్నాయని వారు విమర్శించారు. నేరం జరిగిన ప్రాంతానికి చెందిన ఎస్‌హెచ్‌వోపై చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి ఘటనలు జరగవని తాము డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం, హోం శాఖ అధికారులు చాలా చిన్నచిన్న కారణాలు చూపుతూ తమ ప్రతిపాదనను తోసిపుచ్చుతున్నారని ఆరోపించారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీజేపీ ఎందుకు మౌనముద్ర వహిస్తున్నాయో తెలియడం లేదన్నారు.
Advertisement
Advertisement