వేదిక వద్దకు పోటెత్తిన స్థానికులు, ఆప్ మద్దతుదారులు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామ్‌లీలా మైదానం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు తరలివచ్చారు. హర్యానాలోని కేజ్రీవాల్ స్వగ్రామం సివాన్ నుంచే దాదాపు 150 మంది ఇక్కడికి వచ్చారు. తలపై తెల్లటి టోపీధరించిన కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా కనిపించారు. కార్యకర్తలు తమదైన శైలిలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఓ కార్యకర్త ‘సింగం రిటర్స్న్’ కేప్షన్‌గల పోస్టరుతో కనిపించగా, మరొకరు మఫ్లర్ మాన్ పోస్టర్‌తో వచ్చారు, కొందరు పిల్లలు, పెద్దలు కేజ్రీవాల్ వేషాలంకరణతో కనిపించారు. ఓ కార్యకర్త కేజ్రీవాల్ ఫొటోలతో అలంకరించిన ఒంటెనెక్కి రామ్‌లీలా మైదాన్‌కి రాగా, మరో కార్యకర్త కేజ్రీవాల్ ఫొటోలతో చీపురును నెమలి పింఛంలా తీర్చిదిద్ది వేదికవద్దకు వచ్చాడు. మరో కార్యకర్త కేజ్రీవాల్ భావి ప్రధాని కావాలనే నినాదంతో కూడిన ప్లకార్డు పట్టుకుని దర్శనమిచ్చాడు. మరొకరు గాంధీ వేషధారణలో కనిపించారు. ఆప్ సర్కారు ప్రాధాన్యతలు రాసిఉన్న చొక్కా తొడిగి మరో మద్దతుదారుడు దర్శనమిచ్చారు. ఉదయం 11 గంటల వరకు రామ్‌లీలా మైదాన్ ఆప్ మద్దతుదారులతో నిండిపోయింది.
కేజ్రీవాల్‌కు, ఆప్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ వారు ఆప్ నేతల రాక కోసం నిరీక్షించారు. అర్వింద్ కేజ్రీవాల్ జ్వరంతో ఉన్నారని తెలియడంతో నిరుత్సాహానికి గురైనప్పటికీ ఆయన రాకకోసం వేచిచూశారు. వంద డిగ్రీల జ్వరంతో ఉన్న కేజ్రీవాల్ కౌశాంబీలోని తన నివాసం నుంచి బయలుదేరారన్న వార్త తెలిసిన వెంటనే వారి ఉత్సాహం మిన్నంటింది. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం తాము గంగాజలం తీసుకొచ్చి ప్రార్థనలు చేసినట్లు హరిద్వార్ నుంచి వచ్చిన మద్దతుదారులు తెలిపారు.
ప్రమాణోత్సవ సంబరాలు రామ్‌లీలా మైదానంలోనే కాకుండా వెలుపల కూడా కనిపించాయి. మైదాన్ బయట ఆప్ పేరిట శీతల పానీయాల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి.
ఆప్ కోలా, ఆప్ లెమన్ పేరుతో విక్రయించిన శీతల పానీయాలను పలువురు ఉత్సాహంగా తాగారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ఆప్ మద్దతుదారుల సందడి కనిపించింది. ఫరీదాబాద్‌లో ఆటో డ్రైవర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరని వారిని ఉచితంగా బదర్‌పూర్ సరిహద్దువరకు విడిచిపెట్టి ఆప్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపే హోర్డింగులు రాత్రికి రాత్రి నగరంలతో పలుచోట్ల వెలిశాయి. నీలం చొక్కా, నెహ్రూజాకెట్ ధరించిన కేజ్రీవాల్ చిత్రంతో కూడిన కృతజ్ఞతలు తెలిపే ఆప్ బ్యానర్లు కూడా పలుచోట్ల కనిపించాయి.
కౌశాంబీలోని కేజ్రీవాల్ నివాసం ఆప్ నేతలు, కేజ్రీవాల్ బంధుమిత్రులతో నిండిపోయింది. తల్లి చేతితో నుదుట బొట్టు పెట్టించుకుని, ఆమె అందించిన మిఠాయి తిని కేజ్రీవాల్ రామ్‌లీలా మైదాన్‌కు బయలుదే రారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ , కుమార్ విశ్వాస్‌లతో ఇన్నోవాలో వేదిక వద్దకు చేరుకున్నారు.
జనసంద్రంలా మారిన ‘రాంలీలా’
Published Sat, Feb 14 2015 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement