Ramlila Ground
-
జనసంద్రంలా మారిన ‘రాంలీలా’
వేదిక వద్దకు పోటెత్తిన స్థానికులు, ఆప్ మద్దతుదారులు సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం సందర్భంగా రామ్‌లీలా మైదానం జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు, కార్యకర్తలు తరలివచ్చారు. హర్యానాలోని కేజ్రీవాల్ స్వగ్రామం సివాన్ నుంచే దాదాపు 150 మంది ఇక్కడికి వచ్చారు. తలపై తెల్లటి టోపీధరించిన కార్యకర్తలు, మద్దతుదారులు వేలాదిగా కనిపించారు. కార్యకర్తలు తమదైన శైలిలో కేజ్రీవాల్‌తోపాటు ఆప్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఓ కార్యకర్త ‘సింగం రిటర్స్న్’ కేప్షన్గల పోస్టరుతో కనిపించగా, మరొకరు మఫ్లర్ మాన్ పోస్టర్‌తో వచ్చారు, కొందరు పిల్లలు, పెద్దలు కేజ్రీవాల్ వేషాలంకరణతో కనిపించారు. ఓ కార్యకర్త కేజ్రీవాల్ ఫొటోలతో అలంకరించిన ఒంటెనెక్కి రామ్‌లీలా మైదాన్కి రాగా, మరో కార్యకర్త కేజ్రీవాల్ ఫొటోలతో చీపురును నెమలి పింఛంలా తీర్చిదిద్ది వేదికవద్దకు వచ్చాడు. మరో కార్యకర్త కేజ్రీవాల్ భావి ప్రధాని కావాలనే నినాదంతో కూడిన ప్లకార్డు పట్టుకుని దర్శనమిచ్చాడు. మరొకరు గాంధీ వేషధారణలో కనిపించారు. ఆప్ సర్కారు ప్రాధాన్యతలు రాసిఉన్న చొక్కా తొడిగి మరో మద్దతుదారుడు దర్శనమిచ్చారు. ఉదయం 11 గంటల వరకు రామ్‌లీలా మైదాన్ ఆప్ మద్దతుదారులతో నిండిపోయింది. కేజ్రీవాల్‌కు, ఆప్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ వారు ఆప్ నేతల రాక కోసం నిరీక్షించారు. అర్వింద్ కేజ్రీవాల్ జ్వరంతో ఉన్నారని తెలియడంతో నిరుత్సాహానికి గురైనప్పటికీ ఆయన రాకకోసం వేచిచూశారు. వంద డిగ్రీల జ్వరంతో ఉన్న కేజ్రీవాల్ కౌశాంబీలోని తన నివాసం నుంచి బయలుదేరారన్న వార్త తెలిసిన వెంటనే వారి ఉత్సాహం మిన్నంటింది. కేజ్రీవాల్ ఆరోగ్యం కోసం తాము గంగాజలం తీసుకొచ్చి ప్రార్థనలు చేసినట్లు హరిద్వార్ నుంచి వచ్చిన మద్దతుదారులు తెలిపారు. ప్రమాణోత్సవ సంబరాలు రామ్‌లీలా మైదానంలోనే కాకుండా వెలుపల కూడా కనిపించాయి. మైదాన్ బయట ఆప్ పేరిట శీతల పానీయాల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. ఆప్ కోలా, ఆప్ లెమన్ పేరుతో విక్రయించిన శీతల పానీయాలను పలువురు ఉత్సాహంగా తాగారు. నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో ఆప్ మద్దతుదారుల సందడి కనిపించింది. ఫరీదాబాద్‌లో ఆటో డ్రైవర్లు ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరని వారిని ఉచితంగా బదర్పూర్ సరిహద్దువరకు విడిచిపెట్టి ఆప్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపే హోర్డింగులు రాత్రికి రాత్రి నగరంలతో పలుచోట్ల వెలిశాయి. నీలం చొక్కా, నెహ్రూజాకెట్ ధరించిన కేజ్రీవాల్ చిత్రంతో కూడిన కృతజ్ఞతలు తెలిపే ఆప్ బ్యానర్లు కూడా పలుచోట్ల కనిపించాయి. కౌశాంబీలోని కేజ్రీవాల్ నివాసం ఆప్ నేతలు, కేజ్రీవాల్ బంధుమిత్రులతో నిండిపోయింది. తల్లి చేతితో నుదుట బొట్టు పెట్టించుకుని, ఆమె అందించిన మిఠాయి తిని కేజ్రీవాల్ రామ్‌లీలా మైదాన్‌కు బయలుదే రారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ , కుమార్ విశ్వాస్‌లతో ఇన్నోవాలో వేదిక వద్దకు చేరుకున్నారు. -
అవినీతిని ఎవరు తగ్గించారు?
* మోదీ విమర్శలపై కేజ్రీవాల్ * ఢిల్లీలో విద్యుత్ రేట్లు సగానికి సగం ఎవరు తగ్గించారు? * మాకు ధర్నాలే కాదు.. పాలనా తెలుసునని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: తనకు ధర్నాలు చేయడంతోపాటు పాలన కూడా తెలుసునని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని బీజేపీ ఇప్పడు కొత్త హామీలిస్తోందని దుయ్యబట్టారు. రామ్‌లీలా మైదానంలో తనపై ప్రధాని మోదీ వ్యక్తిగత విమర్శలు చేశారుకానీ తన పాలనపై ఒక్కమాట కూడా అనలేదని పేర్కొన్నారు. దీంతో తన పాలనకు వారే సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పుకున్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బీజేపీకి ఎలాంటి సానుకూల అజెండా లేదు కాబట్టే.. నాపై వ్యక్తిగత విమర్శలు చేసింది. నేను వాటిపై స్పందించను. మాకు పాలన చేతగాదంటున్నారు. ఢిల్లీలో విద్యుత్ రేట్లు సగానికి సగం ఎవరు తగ్గించారు? ప్రజలకు ఉచితంగా నీళ్లు ఎవరిచ్చారు? 2జీ స్కాం, బొగ్గు స్కాంలు చేసినవారికి పాలన తెలుసా? నాకు ధర్నాలు చేయడమే కాదు.. పాలన కూడా తెలుసు’’ అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ గాలికొదిలేసిందని, ఇప్పుడు ఎన్నికల ముంగిట మళ్లీ కొత్త హామీలు ఇస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో కరెంటు రేట్లను, అవినీతిని తగ్గించింది తమ పార్టీయేనని చెప్పారు. ‘‘ఉన్నతస్థాయిలో అవినీతి లేకుండా చేసేందుకు ఏడు నెలలైందని మోదీ చెబుతున్నారు. అది కిందిస్థాయికి ఎప్పుడు వస్తుంది? మీకు తెలియకుంటే మమ్మల్ని అడగండి. మేం 49 రోజుల్లో అవినీతిని తగ్గించాం’’ అని అన్నారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి వారి ఇళ్లను కూలగొట్టిందన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. -
ఆటోవాలా జిందాబాద్!
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వవైభవం సాధించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అన్ని ప్రయత్నాలూ సాగిస్తోంది. ఢిల్లీలో తనకున్న మద్దతును మళ్లీ పెంచుకుని అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మరోమారు ఆటోడ్రైవర్లను ఆకట్ట్టుకనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆప్ గురువారం రామ్‌లీలా మైదాన్‌లో ఆటోడ్రైవర్లతో సభ నిర్వహించింది. దాదాపు ఆరు వేల మంది ఆటోడ్రైవర్లు ఈ సభకు హాజరయ్యారు. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఢిల్లీవాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఆయన చెప్పారు. 49 రోజుల పాలనలో ఆప్ సర్కారు ఎన్నో పనులు చేసిందని ఆయన చెప్పారు. తమ పార్టీ పాలనలో లంచగొండితనం తగ్గిందని, ప్రభుత్వ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని వివరించారు. ఆటోవాలాల సమస్యలను తీర్చడానికి ప్రయత్నించామని తెలియజేశారు. అయితే రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి ఢిల్లీవాసుల కష్టాలు పెరిగాయని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుస్థిరపాలన అందిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులు వేధిస్తున్నట్లయితే సదరు సంభాషణలను రికార్డు చేయాలని ఆయన ఆటోవాలాలను కోరారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆప్‌ను మరోసారి అధికారంలోకి తేవడానికి సహకరించవలసిందిగా ర్యాలీకి హాజరైన ఆటో డ్రైవర్లను కోరారు. ఆటో డ్రైవర్లు రామ్‌లీలా మైదాన్‌కు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్నది రాష్ట్రపతి పాలన కాదని, పోలీసుల పాలన అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లను పోలీసుల జులుం నుంచి కాపాడడానికి తాము సాయం చేస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లపై అన్యాయంగా కేసు నమోదైనట్లయితే తామే న్యాయవాదిని నియమించి న్యాయ సహాయం అందిస్తామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోస్టర్లు అతికించిన ఆటో డ్రైవర్లైను పోలీసులు వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఒకరిద్దరు పోస్టర్లు అతికించడం వల్ల ఈ సమస్య వస్తోందని పేర్కొన్నారు. డ్రైవర్లంతా పోస్టర్లు అంటించినట్తయిదే ఏ సమస్య ఉండబోదని అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. -
హస్తిన బాట
ఏలూరు, న్యూస్‌లైన్:ఢిల్లీలో సమైక్య నినాదాన్ని హోరెత్తించేందుకు జిల్లాకు చెందిన ఎన్జీవోలు, వైసీపీ నాయకులు, కార్యక ర్తలు శనివారం సాయంత్రం ఇక్కడి నుంచి ప్రత్యేక రైళ్లలో బయలుదేరారు. ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే మహాధర్నాలో పాల్గొనేందుకు జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి సుమారు 1,500 మంది ఎన్జీవోలు తరలివెళ్లారు. ఏలూరు పెద్దరైల్వే స్టేషన్ నుంచి సుమారు 800 మంది ‘సమైక్యాంధ్ర ఎన్జీవో ప్రత్యేక రైలు’ ఎక్కారు. ఈ రైలుకు ఎన్జీవో అసోసియేషన్ జిల్లా శాఖ కార్యదర్శి టి.యోగానందం, నాయకులు హరనాథ్, చోడగిరి శ్రీనివాస్ జెండా ఊపి ైరె లును పంపారు. ప్రత్యేక రైలు సౌకర్యంలేని ప్రాంతాల నుంచి, ఆకివీడు, దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల నుంచి ఎన్జీవోలు పెద్ద స్టేషన్‌కు తరలివచ్చారు. ఇదిలావుండగా నరసాపురం ఎక్స్‌ప్రెస్‌లో శనివారం రాత్రి 50 మంది ఎన్జీవోలు ఢిల్లీకి పయనమయ్యారు. పాలకొల్లు నుంచి 50 మంది, తణుకు నుంచి 80 మంది, తాడేపల్లిగూడెం నుంచి 70 మంది బయల్దేరి వెళ్లారు. భీమవరం, నిడదవోలు, ఉండి ప్రాంతాల నుంచి కూడా ఎన్జీవోలు హస్తినబాట పట్టారు. చింతలపూడి, పోలవరం ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ఎన్జీవోలు ఢిల్లీ వెళ్లారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ జిల్లాలో చేపట్టిన ఉద్యమం శనివారం 200వ రోజుకు చేరుకుంది. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జూలై 30న చేపట్టిన నిరసన దీక్షలు 200 రోజుకు చేరారుు. దీక్ష 200 రోజుకు చేరిన సందర్భంగా గాంధీబొమ్మల సెంటర్లో జేఏసీ అధ్యక్షుడు కె.సత్యనారాయణ, కార్యదర్శి డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. వెల్లువలా వెళ్లిన వైసీపీ కార్యకర్తలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు నగరం నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. శనివారం సాయంత్రం 6.30 గంటలకు రాజమండ్రి నుంచి వచ్చిన ప్రత్యేక రైలులో కార్యకర్తలు ఉత్సాహంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు వెళ్లారు. పార్టీ నాయకుడు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యవేక్షణలో నాయకులు పాము శామ్యూల్, కోలపల్లి ఉమాశంకర్, కర్రి శ్రీనులతో పాటు సుమారు 60 మంది కార్యకర్తలు ఢిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరికి పార్టీ నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్ గురునాథ్ తదితరులు వీడ్కోలు పలికారు. ఆహార, పానీయాలు అందించిన తోట ఢిల్లీ వెళుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆహార పానీయాలను ఏలూరు రైల్వే స్టేషన్లో అందజేశారు. విభజన బిల్లును పార్లమెంటులో కూడా అన్ని పార్టీలూ తిరస్కరించాలని కోరుతూ వైసీపీ తలపెట్టిన ఈ ఆందోళనలో పాల్గొనడానికి వెళుతున్న కార్యకర్తలను తోట చంద్రశేఖర్ అభినందించారు. దెందులూరు సమన్వయకర్త సీహెచ్ అశోక్‌గౌడ్, కైకలూరు సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షులు జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నా ధర్నా రాజ్యాంగ విరుద్ధం కాదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున ధర్నా చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. తాను రాజ్యాంగ విరుద్ధమైన పని చేయలేదని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల ఆదేశాలను పాటించని పోలీసులపై చర్య తీసుకోవాలని, ఢిల్లీ పోలీసు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రెండురోజులు ఢిల్లీ నడిబొడ్డున కేజ్రీవాల్ ధర్నా చేయడం తెలిసిందే. దీనిపై జవాబివ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులివ్వడమూ విదితమే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ శనివారమిక్కడి ఛత్రసాల్ స్టేడియంలో ప్రసంగించారు. - ప్రజాప్రయోజనాల కోసం ధర్నా చేయకుండా ఓ ముఖ్యమంత్రిని రాజ్యాంగం అడ్డుకోలేదు. - నేను రాజ్యాంగాన్ని చదివాను. అందులో ఎక్కడా కూడా సీఎం ధర్నా చేయకూడదని లేదు. - మహిళా భద్రతను ప్రస్తావించేందుకే ధర్నా చేశా. - నా ప్రణాళిక తెలుసుకున్న తర్వాతే పోలీసు యంత్రాంగం అక్కడ 144 సెక్షన్ విధించింది. - జన్‌లోక్‌పాల్ బిల్లు దాదాపుగా తయారైంది. ఫిబ్రవరిలో రామ్‌లీలా మైదానంలో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో దానిని ఆమోదిస్తాం. - ఢిల్లీలో మహిళల భద్రతకు ‘మహిళా సురక్ష దళ్’ను ఏర్పాటు చేసేందుకు కమిటీని నియమించాం. ఆప్‌పై వ్యతిరేక కథనాలు ప్రసారం చేసేందుకు మీడియాకు డబ్బులిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నాకు వ్యతిరేకంగా ప్రజలతో మాట్లాడించాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఈ రోజు ఓ టీవీ విలేకరి ఫోన్ చేశాడు. నాకు వ్యతిరేకంగా కథనమివ్వాలని ఆయన బాస్ సూచించారని చెప్పాడు. దీంతో బయటకు వెళ్లి జనాభిప్రాయం కోరగా తొలి 50 మందీ కూడా నాకు వ్యతిరేకంగా చెప్పడానికి అంగీకరించలేదు. వారంతా ప్రభుత్వ పనితీరుగా సంతోషంగా ఉన్నారని చెప్పినట్టు వివరించాడు’ అని పేర్కొన్నారు. -
రామ్‌లీలా మైదానంలో 26న కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26వ తేదీ గురువారం రామ్‌లీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్మంతర్లోనే ప్రమాణ స్వీకారం చేయాలని ముందు అనుకున్నారు. అయితే ప్రమాణ స్వీకార స్థలం ప్రస్తుతం జంతర్‌మంతర్ నుంచి రామ్‌లీలా మైదానంకు మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు కేజ్రీవాల్ అధికారికంగా లేఖ ఇచ్చారు. ఆ లేఖను లెప్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి పంపుతారు. మొత్తం తాము గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే చేయించి అధికారం చేపట్టాలని ఏఏపీ నిర్ణయించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏఏపీకి 6 లక్షల 97 వేల ఎస్ఎంఎస్లు వెళ్లాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఏఏపీ నిర్ణయాన్ని షీలాదీక్షిత్ స్వాగతించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏఏపీనెరవేరుస్తుందన్న ఆశాభావం ఆమె వ్యక్తం చేశారు. ఏఏపీకి షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. భేషరతు మద్దతని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు.