నా ధర్నా రాజ్యాంగ విరుద్ధం కాదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున ధర్నా చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. తాను రాజ్యాంగ విరుద్ధమైన పని చేయలేదని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల ఆదేశాలను పాటించని పోలీసులపై చర్య తీసుకోవాలని, ఢిల్లీ పోలీసు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రెండురోజులు ఢిల్లీ నడిబొడ్డున కేజ్రీవాల్ ధర్నా చేయడం తెలిసిందే. దీనిపై జవాబివ్వాలని ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులివ్వడమూ విదితమే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేజ్రీవాల్ శనివారమిక్కడి ఛత్రసాల్ స్టేడియంలో ప్రసంగించారు.
- ప్రజాప్రయోజనాల కోసం ధర్నా చేయకుండా ఓ ముఖ్యమంత్రిని రాజ్యాంగం అడ్డుకోలేదు.
- నేను రాజ్యాంగాన్ని చదివాను. అందులో ఎక్కడా కూడా సీఎం ధర్నా చేయకూడదని లేదు.
- మహిళా భద్రతను ప్రస్తావించేందుకే ధర్నా చేశా.
- నా ప్రణాళిక తెలుసుకున్న తర్వాతే పోలీసు యంత్రాంగం అక్కడ 144 సెక్షన్ విధించింది.
- జన్‌లోక్‌పాల్ బిల్లు దాదాపుగా తయారైంది. ఫిబ్రవరిలో రామ్‌లీలా మైదానంలో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో దానిని ఆమోదిస్తాం.
- ఢిల్లీలో మహిళల భద్రతకు ‘మహిళా సురక్ష దళ్’ను ఏర్పాటు చేసేందుకు కమిటీని నియమించాం.
ఆప్‌పై వ్యతిరేక కథనాలు ప్రసారం చేసేందుకు మీడియాకు డబ్బులిస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నాకు వ్యతిరేకంగా ప్రజలతో మాట్లాడించాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఈ రోజు ఓ టీవీ విలేకరి ఫోన్ చేశాడు. నాకు వ్యతిరేకంగా కథనమివ్వాలని ఆయన బాస్ సూచించారని చెప్పాడు. దీంతో బయటకు వెళ్లి జనాభిప్రాయం కోరగా తొలి 50 మందీ కూడా నాకు వ్యతిరేకంగా చెప్పడానికి అంగీకరించలేదు. వారంతా ప్రభుత్వ పనితీరుగా సంతోషంగా ఉన్నారని చెప్పినట్టు వివరించాడు’ అని పేర్కొన్నారు.