అవినీతిని ఎవరు తగ్గించారు?
* మోదీ విమర్శలపై కేజ్రీవాల్
* ఢిల్లీలో విద్యుత్ రేట్లు సగానికి సగం ఎవరు తగ్గించారు?
* మాకు ధర్నాలే కాదు.. పాలనా తెలుసునని వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: తనకు ధర్నాలు చేయడంతోపాటు పాలన కూడా తెలుసునని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని బీజేపీ ఇప్పడు కొత్త హామీలిస్తోందని దుయ్యబట్టారు. రామ్‌లీలా మైదానంలో తనపై ప్రధాని మోదీ వ్యక్తిగత విమర్శలు చేశారుకానీ తన పాలనపై ఒక్కమాట కూడా అనలేదని పేర్కొన్నారు. దీంతో తన పాలనకు వారే సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పుకున్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘బీజేపీకి ఎలాంటి సానుకూల అజెండా లేదు కాబట్టే.. నాపై వ్యక్తిగత విమర్శలు చేసింది. నేను వాటిపై స్పందించను. మాకు పాలన చేతగాదంటున్నారు.
ఢిల్లీలో విద్యుత్ రేట్లు సగానికి సగం ఎవరు తగ్గించారు? ప్రజలకు ఉచితంగా నీళ్లు ఎవరిచ్చారు? 2జీ స్కాం, బొగ్గు స్కాంలు చేసినవారికి పాలన తెలుసా? నాకు ధర్నాలు చేయడమే కాదు.. పాలన కూడా తెలుసు’’ అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ గాలికొదిలేసిందని, ఇప్పుడు ఎన్నికల ముంగిట మళ్లీ కొత్త హామీలు ఇస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో కరెంటు రేట్లను, అవినీతిని తగ్గించింది తమ పార్టీయేనని చెప్పారు. ‘‘ఉన్నతస్థాయిలో అవినీతి లేకుండా చేసేందుకు ఏడు నెలలైందని మోదీ చెబుతున్నారు. అది కిందిస్థాయికి ఎప్పుడు వస్తుంది? మీకు తెలియకుంటే మమ్మల్ని అడగండి. మేం 49 రోజుల్లో అవినీతిని తగ్గించాం’’ అని అన్నారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెబుతున్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి వారి ఇళ్లను కూలగొట్టిందన్నారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.