ఆసిఫాబాద్‌కు పూర్వ వైభవం
ఆసిఫాబాద్‌కు పూర్వ వైభవం
Published Wed, Oct 5 2016 12:05 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
జిల్లా ప్రకటనతో ప్రజల్లో ఆనందం
ఆసిఫాబాద్ : కొత్త జిల్లాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్‌ను 31వ జిల్లాగా ప్రకటించడంతో పూర్వ వైభవం సంతరించుకోనుంది. ఆసిఫాబాద్‌ను కొమరంభీమ్ జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గతంలో స్థానిక అంబేద్కర్ చౌక్‌లో 90 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీతో ఉద్యమకారులు దీక్షలు విరమించారు. ఎట్టకేలకు కేసీఆర్ ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భౌగోళికంగా ఆసిఫాబాద్ డివిజన్ 2,85,742 హెక్టార్లు ఉండగా, అందులో 1,10,274 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉంది. జిల్లాలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి చెందే అవకాశాలున్నారుు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు, బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలాలతో జిల్లా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాకు కుమ్రం భీమ్ జిల్లాగా నామకరణం చేసే అవకాశాలన్నారుు.
నిజాం కాలంలో జిల్లా కేంద్రం
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆసిఫాబాద్ ఒకప్పటి జిల్లా కేంద్రం కాగా, ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగుతోంది. నిజాం ప్రభువు 1913లో ఆదిలాబాద్‌లోని జిల్లా కేంద్రాన్ని ఆసిఫాబాద్‌కు తరలించి ఇక్కడే అన్ని వసతులు కల్పించారు. అన్ని జిల్లా కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించారు. 1913 నుంచి 1940 వరకు 27 ఏళ్లపాటు జిల్లా కేంద్రంగా కొనసాగింది. ఢిల్లీ సుల్తానుల ఆధీనంలో 1872లో ఆదిలాబాద్ జిల్లాగా, సిరపూర్(టి), తాండూర్ ఉప జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. 1905లో ఆసిఫ్‌జాహి వంశీకులు ఆదిలాబాద్‌ను స్వతంత్ర జిల్లాగా ప్రకటించారు. 1907 వరకు జనగామగా పేరున్న ఆసిఫాబాద్‌ను ఆసిఫ్‌జాహి వంశానికి చెందిన హైదరాబాద్ బాషా, నిజాముల్ ముల్క్ తమ వంశం పేరుతో ఆసిఫాబాద్‌గా నామకరణం చేశారు. అప్పటి నుంచి జనగామ ఆసిఫాబాద్ పేరుతో పిలుస్తున్నారు. కొంత మంది వృద్ధులు నేటికి ఆసిఫాబాద్‌ను జనగామగానే పిలుస్తారు.
తొలగనున్న కష్టాలు
నియోజకవర్గ ప్రజలకు జిల్లా కేంద్రం ఆదిలాబాద్ సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో వివిధ అవసరాలకు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఇబ్బందులకు గురయ్యేవారు. రెవెన్యూ, కోర్టు కేసులు, వైద్యంతోపాటు ఇతర కార్యాలయ పనులకు తూర్పు జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల ప్రజలు వెళ్తుంటారు. దూరభారంతో పనుల నిమిత్తం జిల్లా కేంద్రంలో బస చేయాల్సి వచ్చేది. ఆసిఫాబాద్ జిల్లా ప్రకటన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మంగళవారం సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, కాగజ్‌నగర్ డీఎస్పీ హబీబ్‌ఖాన్ పట్టణంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు ఇతర శాఖల ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలు పరిశీలించారు.
ఇప్పటికీ జిల్లా ఆనవాళ్లు
నిజాం పరిపాలనలో ఆసిఫాబాద్‌లో నిర్మించిన భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. జిల్లా జైలు, పోలీసుస్టేషన్ భవనాలు నేటికి కొనసాగుతున్నాయి. కోర్టు భవనాలు, తహశీల్దార్ కార్యాలయంతోపాటు కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి.
Advertisement