హోటల్ గదిలో రూ.13 లక్షల విలువైన వజ్రాల నగలు చోరీ చేసిన అసిస్టెంట్ డెరైక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై : హోటల్ గదిలో రూ.13 లక్షల విలువైన వజ్రాల నగలు, మూడు సెల్‌ఫోన్లు చోరీ చేసిన సినిమా అసిస్టెంట్ డెరైక్టర్‌ను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన అత్తీవ్వరన్ (39) పారిశ్రామికవేత్త. ఇతడు భార్యతో గత 14వ తేదీ ఉదయం చెన్నై వడపళనికి వచ్చి ప్రైవేటు హోటల్‌లో బస చేశాడు. భార్యతో షాపింగ్ వెళ్లి రాత్రి 12.30 గంటలకు హోటల్ గదికి వచ్చాడు.
గదిలో అత్తీవ్వరన్, అతని భార్య ధరించిన వజ్రాల నెక్లస్, ఉంగరాలు, గడియారం, ఐఫోన్, రెండు విలువైన సెల్‌ఫోన్లు టేబుల్‌పై పెట్టి నిద్రపోయారు. ఉదయాన్నే నగలు చోరీకి గురైనట్లు తెలిసింది. దీనిపై విరుగంబాక్కం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులో సంబంధించిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని నగర కమిషనర్ టి.కె.రాజేంద్రన్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం పోలీసులు హోటల్ ఉన్న సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా అనుమానాస్పదరీతిలో సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతని పేరు మణికంఠన్ (24) అని వడపళనికి చెందిన ఇతడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాల్లో పని చేశాడని తెలిసింది. అదే హోటల్‌లో గది తీసుకున్న మణికంఠన్ అత్తీశ్వరన్ గది తలుపులు తెరచి ఉన్న సమయంలో వజ్రాల నగలను చోరీ చేసినట్లు తెలిసింది. మణికంఠన్‌ను అరెస్టు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచి జైలుకు తరలించారు.