ఏటీఎంలో సొమ్ము దొంగిలించి ... జూదంలో పెట్టాడు
ఏటీఎంలో సొమ్ము కొల్లగోట్టాడు. ఆ సొమ్మును సులభంగా రెట్టింపు చేయాలనుకున్నాడో ఏమో తీసుకువెళ్లి జూదంలో పెట్టాడు. జూదంలో ఆ సొమ్ముంతా పోయింది. వివరాలు....చెన్నై నగరంలోని గూడువాంజేరి పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం సెంటర్‌లోకి ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి ఓ దొంగ చొరబడి జిలెటెన్ స్టిక్స్‌తో పేల్చాడు. ఆ ఏటీఎంలో నగదు చోరీపై పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా తిరుచ్చి జిల్లా మిసిరితాలుకా కుత్తనాంబట్టి గ్రామం ఉత్తర వీధికి చెందిన కుమార్(25)కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులు... నిందితుడు కుమార మడిపాక్కంలో ఉన్నట్లు గుర్తించి చెంగల్పట్టు డీఎస్పీ కుమార్ ఆధ్వర్యంలోని అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని సమయపురం ఇన్‌స్పెక్టర్ మనోహరన్ ఆధ్వర్యంలో నిందితుడు కుమారును విచారించారు. ఆ విచారణలో కుమార్ పలు అసక్తికరమైన విషయాలు పోలీసులకు వెల్లడించాడు.
గతంలో తిరుప్పూర్ ఏటీఎం పేల్చివేత ఘటనలో తనకు సంబంధం ఉన్నట్లు కుమార్ పోలీసులకు వెల్లడించాడు. అలాగే గత మార్చిలో తిరుచ్చి టోల్‌గేట్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని కూడా ఇదే విధంగా పేల్చివేసి రూ. 25 లక్షలు దోచుకున్నానని తెలిపాడు. ఆ నగదులో సగం సొమ్మును పుదుచ్చేరిలోని ఒక క్లబ్‌లో జూదం ఆడి పొగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో విలాసాలు చేసిటనట్లు పోలీసుల విచారణలో వివరించాడు.
నిందితుడు కుమార్ తల్లి మంగై ముసిరి పంచాయతీ యూనియన్ అన్నాడీఎంకే కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె రెండో కుమారుడైన కుమార్ ఉద్యోగం లేకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఆ క్రమంలో కొన్ని రోజుల క్రితం చెన్నై చేరుకున్నాడు. అనేక చిత్రాల్లో సహాయక నటుడిగా నటించాడు. ఆ తర్వాత సినిమాలు లేకపోవడంతో ఏటీఏంలో సొమ్ము దొంగిలించడమే పనిగా పెట్టుకున్నాడు.