
నవ దంపతులపై దాడి..వధువు కిడ్నాప్
కేకే.నగర్: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న నవ దంపతులపై దాడి చేసి వధువును కిడ్నాప్ చేసిన సంఘటన చెంగల్పట్టు సమీపంలో చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా చెంగల్పట్టు సమీపంలోని వీరాపురానికి చెందిన కన్నియప్పన్ కుమార్తె రమ్య (20)ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఈచ్చంకరనైకి చెందిన మురుగేశన్ కుమారుడు పశుపతి (25) కారు డ్రైవర్. రమ్య, పశుపతి రెండేళ్లుగా ప్రేమించుకున్న వీరు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో వీరి పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు.
25న రమ్య, పశుపతి ఇంటి నుంచి వెళ్లిపోయి తిరుపతిలో పెళ్ళి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రమ్య కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు చెంగల్పట్టు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని రమ్య కోసం వెతుకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నవదంపతులు ఇద్దరు చెంగల్పట్టు టౌన్ పోలీసుస్టేషన్ లో ప్రేమ వ్యవహారం చెప్పేందుకు కారులో బయలుదేరారు. విషయం తెలిసి రమ్య అన్న వినోద్ అతని మిత్రులు మరో కారులో వారి కారును వెంబడించి అడ్డుకున్నారు. రమ్యను కారు నుండి కిందకు దిగమని బెదిరించగా దిగకపోవడంతో కారు అద్దాలు పగులగొట్టి పశుపతిపై దాడి జరిపారు. తర్వాత రమ్యను తమ కారులో ఎక్కించుకుని వెళ్ళారు. ఈ ఘటనపై చెంగల్పట్టు టౌన్ పోలీసులకు పశుపతి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వినోద్, అతని మిత్రులు, రమ్య కోసం గాలిస్తున్నారు.