కొనసాగుతున్న టీడీపీ దౌర్జన్యాలు
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌర్జన్యాలను కొనసాగిస్తూనే ఉన్నారు. వీరి అరాచకాలు ఆదివారం రాత్రి, సోమవారం కొనసాగాయి. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడిచేశారు. హోటల్ ధ్వంసం చేశారు. షెడ్డు కూల్చేస్తామని నోటీసు ఇప్పించారు. రియల్టర్లను బెదిరించారు. – సాక్షి నెట్వర్క్⇒ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం ముచ్చురామి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు క్రిష్టయ్య, బాలచంద్ర వేట కొడవళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. రామకృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం తమ పొలంలో తెగిపడిన మోటర్ తీగలను విద్యుత్‌శాఖ అధికారులతో సరిచేస్తున్నారు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులు బాలచంద్ర, క్రిష్టయ్య.. రామకృష్ణారెడ్డి, పక్కనున్న నరేంద్రరెడ్డితో గొడవకు దిగారు. గొడవ తీవ్రమై పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాలచంద్ర, క్రిష్టయ్య వేట కొడవళ్లతో రామకృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డిపై వేట కొడవళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు.⇒ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి పంచాయతీ మహదేవపురం ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీ కార్యకర్త కంకిపాటి వెంకటేశ్వరరావు షెడ్డును వెంటనే తొలగించాలని పంచాయతీ వారు నోటీసు ఇచ్చారు. వెంకటేశ్వరరావు తండ్రి సత్తియ్య సుమారు 40 ఏళ్ల కిందట గ్రామంలోని ప్రభుత్వభూమిలో పశువుల పాక నిర్మించుకున్నారు. సత్తియ్య మరణానంతరం ఆ స్థలం అతడి కుమారుడు వెంకటేశ్వరరావు ఆధీనంలో ఉంది. వెంకటేశ్వరరావు ఇటీవల ఆ స్థలంలో షెడ్డు నిర్మించారు. వెంటనే ఆ షెడ్డును తొలగించాలని పంచాయతీ కార్యదర్శి రామలక్ష్మి ఈనెల 11న , మళ్లీ సోమవారం పంచాయతీ గుమాస్తా, సచివాలయ మహిళా పోలీస్ మరో నోటీసు ఇచ్చారు.వెంకటేశ్వరరావు ఇంటిపక్కన అదే ఆక్రమిత భూమిలో ఉన్న టీడీపీ కార్యకర్త భీమడోలు కృష్ణకు పంచాయతీ వారు నోటీసు ఇవ్వలేదు. తనకే నోటీసు ఎందుకిచ్చారని పంచాయతీ అధికారులను ప్రశ్నించగా.. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా నోటీసులు ఇస్తున్నామన్నారని వెంకటేశ్వరరావు చెప్పారు. వైఎస్సార్ జయంతి వేడుకల్లో తన కుమారుడు సతీష్ పాల్గొనడం వల్లే టీడీపీ నేతలు కక్ష సాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.⇒ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సోమవారం వైఎస్సార్సీపీ అభిమాని ముజావర్ సైదావలిపై టీడీపీ వర్గీయుడు ముజావర్ బాజి దాడిచేశాడు. రోడ్డు మీద ఎదురొచ్చిన సైదావలిని దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళల్ని దూషించాడు. ఈ దాడిపై సైదావలి ముప్పాళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ⇒ వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని స్విస్ట్ కళాశాల సమీపంలో నిర్మాణంలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద టీడీపీ నాయకులు హడావుడి చేశారు. వెంచర్ మేనేజర్, సూపర్వైజర్లను భయభ్రాంతులకు గురిచేసి పనులను నిలిపేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అనుమతి తీసుకుని వెంచర్లు వేయాలని హెచ్చరించారు. టీడీపీ నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, వీరకుమార్‌రెడ్డి, మావిరెడ్డి, మరో నలుగురు తమ అనుమతులు లేకుండా పనులు చేస్తే టిప్పర్లు, జేసీబీలను పెట్రోల్ పోసి కాల్చేస్తామని హెచ్చరించారని సదరు కాంట్రాక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ⇒ గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం రాత్రి టీడీపీ వారు వైఎస్సార్సీపీ నాయకుడు సుభాని హోటల్‌ను ధ్వంసం చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన యువకులు టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ రోడ్డులోని హోటల్లో సామగ్రిని, ఆహారాన్ని రోడ్డుమీదకు విసిరేసి సుమారు రెండుగంటల పాటు వీరంగం చేశారు. అడ్వాన్స్ తీసుకుని సకాలంలో మటన్ ఇవ్వనందుకు మూడునెలల కిందట చినరావూరుతోటలోని మాంసం వ్యాపారి మక్బుల్‌ను సుభాని మందలించాడు. ఇది మనసులో పెట్టుకున్న మక్బుల్ ఆదివారం రాత్రి కొందరు యువకులతో కలిసి సుభాని హోటల్‌పై రాళ్లతో దాడిచేశాడు. సుభాని బుల్లెట్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో యువ కుడు మహబూబ్‌కు గాయాలవగా 108లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరోవైపు తాము వహాబ్చౌక్లోని ఓ హోటల్ నుంచి ఆహారం తీసుకెళుతుండగా సుభాని, అతడి హోటల్లో పనిచేసేవారు తమపై దాడిచేశారని మక్బుల్ వర్గీయులు చెబుతున్నారు.