చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రం అనేక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతుండగా, రోడ్డు ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోవడంలో సైతం అగ్రభాగాన నిలుస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. చివరికి రాష్ట్రం ప్రమాదాల రాజధానిగా మారిపోయిందని రాష్ట్ర రవాణాశాఖే అభిప్రాయపడుతోంది. ఇది కేవలం తమ అభిప్రాయం కాదు, ఇందుకు తగిన లెక్కలు, ఆధారాలు ఉన్నాయంటూ రవాణాశాఖ రహస్యంగా వాటిని బయటపెట్టింది. గత ఏడాది లెక్కల ప్రకారం సగటున ప్రతి 8 నిమిషాలకో ప్రమాదం, ప్రతి 33 నిమిషాలకు ఒకరి మృతి చెందినట్లు తేలింది. గత ఏడాది 66,238 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి, వీటిల్లో 14,504 తీవ్రస్థాయిలో కూడిన ప్రమాదాలు కాగా మొత్తం 15,563 మంది ప్రాణాలు విడిచారు. 2012లో 67,757 సాధారణం, 15,072 తీవ్రం కాగా 16,175 మంది మృతి చెందారు. 2011లో 65,873 సాధారణం, 14,359 తీవ్రం కాగా 15,422 మంది మృత్యువాత పడ్డారు. 2010లో 64,996 సాధారణ ప్రమాదాలు, 14,241 తీవ్రస్థాయి ప్రమాదాలు చోటుచేసుకోగా 15,409 మంది బలైపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు 22,078 ప్రమాదాలు నమోదుకాగా 5,078 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం చెన్నైలో 3,059 ప్రమాదాల్లో 366 మంది మృత్యువాత పరిస్థితి తీవ్రతకు అద్దంపట్టింది.
మార్పు అనివార్యం: రాజ్‌బేరుబాల్ (ఎన్‌జీవో)
ప్రజల్లో, రోడ్ల నిర్మాణంలో మార్పు వచ్చినపుడే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని రోడ్డు భద్రత, మౌలిక సదుపాయూలు విభాగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి రాజ్‌బేరువాల్ వ్యాఖ్యానించారు. పబ్లిక్‌ట్రాన్స్‌పోర్టు సౌకర్యం పెంచి ప్రైవేటు వాహనాల సంఖ తగ్గేలా చూడాలని సూచించారు. తక్కువ వాహనాలు అంటే తక్కువ ప్రమాదాలు, తక్కువ మృతులు అని అర్థం అన్నారు. రోడ్ల నిర్మాణాల్లో వేగాలకు తగినట్లుగా వేర్వేరు లైన్లు, ప్రమాద మలుపులు లేకుండా చూడటం, సూచిక బోర్డులు వంటి మెరుగైన పద్ధతులు అవలంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. రవాణాశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2005 నుంచి ప్రమాదాల సంఖ్య పెరుగుతోందని అంగీకరించారు. డ్రైవింగ్‌లో వేగం, నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు. ప్రభుత్వ పరంగా ప్రమాదాల నివారణకు ఁరోడ్డు సేఫ్టీ పాలసీరూ.ని 2007లో రూపొందించామని తెలిపారు. గతంతో పోల్చుకుంటే గత ఏడాది 20 శాతం ప్రమాదాలను అరికట్టగలిగామని చెప్పారు. రహదారుల్లో యాక్సిడెంట్ జోన్స్‌ను గుర్తించి వాటిల్లో మార్పులు చేర్పులు చేయాల్సిందిగా సంబంధిత శాఖకు సూచనలు ఇచ్చామని తెలిపారు.
త్వరలో ఆస్ట్రేలియా విధానం అమలు
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న ప్రమాదాల నివారణకు ఆస్ట్రేలియా విధానాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. రోడ్డు భద్రతా పథకం కింద దీనిని ముందుగా చెన్నై ఈసీఆర్ రోడ్డులో అమలు చేస్తారు. 50 కిలోమీటర్ల పొడవున్న ఈసీఆర్ రోడ్డులో రోజుకు 13వేల వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. ఈ కారణంగా ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రెండేళ్లలో ఈసీఆర్ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.272 కోట్లు కేటాయించింది. రోడ్డును పరిశీలించి తగిన సూచనలు ఇచ్చేందుకు ఆస్ట్రేలియా నిపుణుల బృందం ఈనెల లేదా జూలైలో చెన్నై చేరుకోనుంది.
ప్రమాదాల రాజధాని
Published Mon, Jun 9 2014 11:38 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement