బ్రహ్మదేవుడే వచ్చి బతిమాలినా ఒప్పుకోం..
► చిక్కలో నటుడు సత్యరాజ్ దిష్టిబొమ్మ దహనం
► కట్టప్ప క్షమాపణ చెప్పాల్సిందే : వాటాళ్ నాగరాజు
సాక్షి, బెంగళూరు: సాక్షాత్తు బ్రహ్మదేవుడే వచ్చి కన్నడ భాషలో మాట్లాడినా కూడా బాహుబలి–2 విడుదలకు ఒప్పుకునేది లేదని, తమిళనటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ చళవళి పార్టీ నాయకుడు వాటాళ్ నాగరాజు స్పష్టం చేశారు. చిత్రదుర్గలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బాహుబలి దర్శకుడు రాజమౌళి విడుదలకు సహకరించాలని రికార్డెడ్ వీడియోలో కోరిన సందర్భంగా స్పందిస్తూ సత్యరాజ్‌పైనే తమ పోరాటమని, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఈనెల 28న బెంగళూరు బంద్ నిర్వహిస్తామని అఆన్నరు. కన్నడ సినిమా రంగం కూడా ఇందుకు మద్దతు ఉందని అన్నారు. 21న సత్యరాజ్ శవయాత్ర నిర్వహిస్తామని వాటాళ్ చెప్పారు.
కట్టప్ప క్షమాపణ చెప్పాలిందే !
చిక్కబళ్లాపురం : కావేరి విషయంలో కన్నడ ప్రజలను అపహాస్యంగా మాట్లాడిన నటుడు సత్యరాజ్ క్షమాపణ చెబితేనే బాహుబలి–2 విడుదల సమ్మతిస్తామని కరవే నాయకులు హెచ్చరించారు. గురువారం ఇక్కడి శిడ్లఘట్ట సర్కిల్లో కరవే కార్యకర్తలు ర్యాలీగా వచ్చి నటుడు సత్యరాజ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... సత్యరాజ్ క్షమాపణ చెప్పే వరకు కర్ణాటకలో బాహుబలి–2ను విడుదల చేస ప్రసక్తే లేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కరవే నాయకులు మంజునాథ్, కేశవమూర్తి, భరత్ కుమార్, చంద్రశేఖర్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
మండ్యలో కరవే ధర్నా
తమిళ నటుడు సత్యరాజ్ కన్నడ ప్రజలను క్షమాపణ కోరాలని, అప్పటి వరకు రాష్ట్రంలో బాహుబలి–2 విడుదలకు అనుమతించమని కర్ణాటక రక్షణ వేదిక (ప్రవీణ్ శెట్టి) కార్యకర్తలు గురువారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం సత్యరాజ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.