సాక్షి, బెంగళూర్ : కర్ణాటక సీనియర్ నేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ పెద్ద షాకే ఇచ్చారు. దాదాపు 400లకి పైగా మెట్లు ఎక్కి ఆశ్చర్యానికి గురి చేశారు. శనివారం శ్రావణ బెళగొళ లోని బాహుబలి మహామస్తకాభిషేక కార్యక్రమానికి వెళ్లిన ఆయన ఈ పని చేశారు.
86 ఏళ్ల దేవెగౌడ తన భార్య, కుటుంబ సభ్యులతో కలిసి బాహుబలి(గోమఠేశ్వర విగ్రహ) 88వ మహామస్తకాభిషేకం నిర్వహించేందుకు వింధ్యగిరి పర్వతాలకు వెళ్లారు. ఆయన భార్య చిన్నమ్మ పల్లకిలో వెళ్లగా.. ఈయన మాత్రం కాలినడకన బయలుదేరారు. ఆరోగ్య సమస్యల రిత్యా డోలిలో(పల్లకి తరహా) వెళ్లాలంటూ బంధువులు ఆయనకు సూచించారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటూ మెట్లు ఎక్కేశారు. ఇద్దరు భద్రతా సిబ్బంది సాయంతో 50 నిమిషాల్లో మెట్లు ఎక్కేశారు. కొందరు అనుచరులు ఆయన్ని వెంబడిస్తూ బాహుబలి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగించారు.
అయితే అన్ని మెట్లు ఒకేసారి ఎక్కేసరికి ఆయన కాస్త అలసటకు లోనయ్యారు. దీంతో కొండ పైన ఉన్న ఆరోగ్య కేంద్రంలో కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆపై మహామస్తకాభిషేకంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా ఆయన కాలి నడకనే దిగటం విశేషం. గత వారం సిద్ధరామయ్య కూడా డోలిని తిరస్కరించి మెట్లెక్కి కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment