బాలచందర్ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు : ఆర్‌కే రోజా
నగరి(చిత్తూరు): పముఖ దర్శకుడు బాలచందర్ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటని సినీనటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహానటులను పరిచయం చేసిన ఘనత బాలచందర్‌కు దక్కుతుందని అన్నారు. నటులు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల హాసన్, ప్రకాష్‌రాజ్ లాంటి వందలాది నటులను, మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రహమాన్‌ను చిత్రసీమకు ఆయనే పరిచయం చేశారన్నారు. వందకు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారన్నారు. ప్రతి చిత్రాన్ని తనదైన శైలిలో వినూత్నంగా మలచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 2014 చలన చిత్ర పరిశ్రమకు అచ్చిరాలేదన్నారు. మహా నటులు అక్కినేని నాగేశ్వరరావు, మ్యూజిక్ డెరైక్టర్ చక్రి, శ్రీహరి, ఉదయకిరణ్, తెలంగాణ శకుంతల, ధర్మవరపు సుబ్రమణ్యం, శర్మ, మంజుల, బాపు లాంటి ఎందరినో ఈ ఏడాది చరిత్రలో కలిపి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.