బెంగళూరు పోలీస్ కమిషనర్‌గా ఎం.ఎన్.రెడ్డి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : వరుస అత్యాచార సంఘటనలతో ప్రభుత్వం ప్రతిష్ట మసక బారడంతో పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను సోమవారం సాయంత్రం ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీ ఎంఎన్. రెడ్డి నియమితులయ్యారు. రెడ్డి స్థానంలో హెచ్‌సీ. కిశోర్ చంద్ర నియమితులయ్యారు.
ఇప్పటి వరకు ఆయన కమ్యూనికేషన్, లాజిస్టిక్, ఆధునికీకరణ విభాగంలో అదనపు డీజీపీగా పని చేశారు. రాఘవేంద్ర ఔరాద్కర్ కర్ణాటక రిజర్వు పోలీసు అదనపు డీజీపీగా నియమితులయ్యారు. నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు) కమల్ పంత్‌పై కూడా బదిలీ వేటు పడింది. ఫిర్యాదులు, మానవ హక్కుల విభాగానికి ఆయన ఐజీపీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆ స్థానంలోని ఐజీపీ అలోక్ కుమార్‌ను నగర అదనపు పోలీసు కమిషనర్ (శాంతి భద్రతలు)గా నియమించారు.
ఒత్తిడి పెరగడంతో...
నగరంలో వరుస అత్యాచార ఘటనలు ప్రభుత్వాన్ని ఊపిరి సలుపుకోకుండా చేశాయి. వాస్తవానికి రాఘవేంద్ర ఔరాద్కర్‌పై వేటు పడుతుందని ముందుగానే ఊహించినా, ఇంత హఠాత్తుగా జరుగుతుందనుకోలేదు. ఆయన పని తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న శాసన సభ సమావేశాల తర్వాత బదిలీ చేస్తారని వినవచ్చింది. అయితే తొలుత పీజీ విద్యార్థిని, తర్వాత అరేళ్ల బాలికపై లైంగిక దాడులు జరగడంతో ప్రతిపక్షాలు శాసన సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లైంగిక దాడులపై రోజు రోజుకు నిరసనల హోరు ఎక్కువవడంతో ప్రభుత్వం తక్షణమే ఈ బదిలీలకు ఉపక్రమించింది.