రూ.40లక్షల జీతం.. అయినా కక్కుర్తి! | bangalore techie stolen aadhaar card data and sold | Sakshi
Sakshi News home page

రూ.40లక్షల జీతం.. అయినా కక్కుర్తి!

Published Thu, Aug 3 2017 8:25 PM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

రూ.40లక్షల జీతం.. అయినా కక్కుర్తి!

రూ.40లక్షల జీతం.. అయినా కక్కుర్తి!

కర్ణాటక: ఆధార్‌ సమాచారాన్ని అనధికారికంగా లీక్‌ చేయడం, డౌన్‌లోడ్‌ చేసుకోగలిగే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్లను రూపొందించి దొంగచాటుగా విక్రయిస్తున్న ఐఐటీ పీజీ పట్టభద్రుడు, ఓలా కంపెనీ టెక్కీ అభినవ్‌ శ్రీవాత్సవ (30)ను బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ టీ.సునీల్‌కుమార్‌ గురువారం మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు తెలియచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అభినవ శ్రీవాత్సవ ఓలా కంపెనీలో ఏడాదికి రూ.40 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భారీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హవ్యాసి అనే మొబైల్‌ అప్లికేషన్‌ను అభివృద్ది చేశాడు.

దీని ద్వారా యూఐడీఏఐ ఆధార్‌ సర్వర్‌లోకి చొరబడి ఆధార్‌ సమాచారాన్ని సేకరించవచ్చు.  ఇప్పటి వరకు అభినవ్‌ ఇలాంటి యాప్‌లు ఐదింటిని రూపొందించాడు.  ఈ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారాన్ని, యాప్‌లను కోరినవారికి ఆన్‌లైన్‌లో అమ్ముకుంటున్నాడు. దీనిపై జనవరి 26వ తేదీన ఆధార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బెంగళూరు హైగ్రౌండ్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలైంది. సీసీబీ అదనపు కమిషనర్‌ ఎస్‌.రవి, ఏసీపీ వెంకటేశ్‌ ప్రసన్నల బృందం దర్యాప్తు చేసి నిందితున్ని గురువారం అరెస్టు చేశారు.

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో పీజీ..: 2009 లో ఖరగ్‌పూర్‌లో ఐఐటీలో ఇండస్ట్రీయల్‌ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఇతడు 2010లో బెంగళూరుకు చేరుకుని ఒక ప్రైవేటు కంపెనీలో చేరాడు. 2012లో సొంతంగా షేర్‌ లావాదేవీలు జరిపే సంస్థను ఏర్పాటు చేశాడు. దానిని నిర్వహించలేక మూసివేసి 2015లో ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేశాడు. గతేడాది నుంచి బెంగళూరు ఓలా కేంద్ర కార్యాలయంలో ఏడాదికి రూ.40 లక్షల వేతనంతో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని కమిషనర్‌ తెలిపారు.

గత జనవరి నుంచి జూన్‌ వరకు శ్రీవాత్సవ్‌ అభివృద్ధి చేసిన ఆధార్‌ యాప్‌తో రూ.40 వేల వరకు సంపాదించాడని విచారణలో వెలుగుచూసింది. ఇతను దేశప్రజల రహస్యాల్ని బహిరంగపరిచే తీవ్ర నేర కార్యకలాపాల్లో పాల్గొనడం, చట్టవ్యతిరేకంగా ఆధార్‌ యాప్‌లను రూపొందించడం తదితర అభియోగాలపై మరింత విచారణ చేపడుతున్నామని కమీషనర్‌ తెలిపారు. నిందితుడి నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 1 ట్యాబ్లెట్‌, నాలుగు సెల్‌ఫోన్లు, 6 పెన్‌డ్రైవ్లు, 1 కంప్యూటర్‌తో పాటు రూ.2.25 లక్షల విలువైన ఇతర సామగ్రిని పోలీసలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement