sofrware engineer
-
రూ.40లక్షల జీతం.. అయినా కక్కుర్తి!
కర్ణాటక: ఆధార్ సమాచారాన్ని అనధికారికంగా లీక్ చేయడం, డౌన్లోడ్ చేసుకోగలిగే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లను రూపొందించి దొంగచాటుగా విక్రయిస్తున్న ఐఐటీ పీజీ పట్టభద్రుడు, ఓలా కంపెనీ టెక్కీ అభినవ్ శ్రీవాత్సవ (30)ను బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీ పోలీస్ కమిషనర్ టీ.సునీల్‌కుమార్ గురువారం మీడియా సమావేశంలో నిందితుడి వివరాలు తెలియచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన అభినవ శ్రీవాత్సవ ఓలా కంపెనీలో ఏడాదికి రూ.40 లక్షల వేతన ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భారీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హవ్యాసి అనే మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ది చేశాడు. దీని ద్వారా యూఐడీఏఐ ఆధార్ సర్వర్లోకి చొరబడి ఆధార్ సమాచారాన్ని సేకరించవచ్చు. ఇప్పటి వరకు అభినవ్ ఇలాంటి యాప్‌లు ఐదింటిని రూపొందించాడు. ఈ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారాన్ని, యాప్‌లను కోరినవారికి ఆన్లైన్లో అమ్ముకుంటున్నాడు. దీనిపై జనవరి 26వ తేదీన ఆధార్ డిప్యూటీ డైరెక్టర్ బెంగళూరు హైగ్రౌండ్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలైంది. సీసీబీ అదనపు కమిషనర్ ఎస్.రవి, ఏసీపీ వెంకటేశ్ ప్రసన్నల బృందం దర్యాప్తు చేసి నిందితున్ని గురువారం అరెస్టు చేశారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో పీజీ..: 2009 లో ఖరగ్‌పూర్‌లో ఐఐటీలో ఇండస్ట్రీయల్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన ఇతడు 2010లో బెంగళూరుకు చేరుకుని ఒక ప్రైవేటు కంపెనీలో చేరాడు. 2012లో సొంతంగా షేర్ లావాదేవీలు జరిపే సంస్థను ఏర్పాటు చేశాడు. దానిని నిర్వహించలేక మూసివేసి 2015లో ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేశాడు. గతేడాది నుంచి బెంగళూరు ఓలా కేంద్ర కార్యాలయంలో ఏడాదికి రూ.40 లక్షల వేతనంతో సాఫ్ట్వేర్ డెవలప్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని కమిషనర్ తెలిపారు. గత జనవరి నుంచి జూన్ వరకు శ్రీవాత్సవ్ అభివృద్ధి చేసిన ఆధార్ యాప్‌తో రూ.40 వేల వరకు సంపాదించాడని విచారణలో వెలుగుచూసింది. ఇతను దేశప్రజల రహస్యాల్ని బహిరంగపరిచే తీవ్ర నేర కార్యకలాపాల్లో పాల్గొనడం, చట్టవ్యతిరేకంగా ఆధార్ యాప్‌లను రూపొందించడం తదితర అభియోగాలపై మరింత విచారణ చేపడుతున్నామని కమీషనర్ తెలిపారు. నిందితుడి నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 1 ట్యాబ్లెట్, నాలుగు సెల్ఫోన్లు, 6 పెన్‌డ్రైవ్‌లు, 1 కంప్యూటర్‌తో పాటు రూ.2.25 లక్షల విలువైన ఇతర సామగ్రిని పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబంపై అమానుషం
ఢిల్లీ: వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన ఓ ఆటో డ్రైవర్ దారుణంగా వ్యవహరించాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చాల్సిందిపోయి, వారిని నిలువునా దోచుకున్న వైనం ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్ పూజ కోసం బిహార్ లోని సొంత ఊరికి వెళ్లి తిరిగి ఢిల్లీకి తిరిగి వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబానికి ఈ ఘోరమైన అనుభవం గత శుక్రవారం ఎదురైంది. కలకలం రేపిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ వాస్తవ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య, కొడుకు తీవ్రగాయాలతో ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబోధ్ శ్రీవాస్తవ్ (42) భార్య సుష్మ, కొడుకు ప్రియన్ తో కలిసి ఢిల్లీకి వస్తూ అనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడినుంచి ఇంటికి రావడానికి ఆటో మాట్లాడుకున్నారు. అతి వేగంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ ను రెండు సార్లు వారించాడు శ్రీ వాస్తవ్. అయినా వినకుండా మరింత వేగం పెంచాడా డ్రైవర్. దీంతో అదుపు తప్పిన ఆటో డివైడర్ ఢీకొట్టి పల్టీ కొట్టింది. శ్రీవాస్తవ ఆటో కిందపడి చనిపోయాడు. అయితే బాధితులను ఆదుకోవాల్సిన ఆటోడ్రైవర్ మనసులో దుర్బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు కానీ, వారికి సంబంధించిన మూడు బ్యాగులను, ల్యాప్ ట్యాప్ ను తీసుకుని అక్కడినుంచి ఉడాయించాడు. వేగంగా నడపొద్దని తన భర్త వారించినా వినకుండా డ్రైవర్ చాలా ర్యాష్ గా మాట్లాడి మరింత వేగం పెంచాడని శ్రీవాస్తవ్ భార్య సుష్మ ఆరోపించారు. దీంతో ఆటో తిరగబడి పోయిందని ఆమె తెలిపారు. తన భర్త ఆటో కింద పడిపోగా, కొడుకు దూరంగా పడిపోవడం తనకు లీలగా గుర్తుందని తెలిపింది. ఆటోను పక్కకు తీసిన డ్రైవర్ సామాను ఆటోలో పెడుతోంటే, తమకు సాయం చేస్తున్నాడనుకున్నాననీ, కానీ తమ బ్యాగులు తీసుకుని అక్కడినుంచి పరారవుతాడని అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ తరువాత కొద్దిసేపు తనకేమీ తెలియలేదనీ, మెల్లిగా తేరుకుని, ఆ దారిన వెళుతున్న వాహనదారులను సాయమడిగి ఆసుపత్రికి చేరామంటూ ఆ దుర్ఘటను గుర్తు చేసుకున్నారు. తన భర్త మరణానికి కారణమైన ఆ ఆటోడ్రైవర్ ని గుర్తు పడతానని తెలిపారు.