సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబంపై అమానుషం
ఢిల్లీ: వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన ఓ ఆటో డ్రైవర్ దారుణంగా వ్యవహరించాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చాల్సిందిపోయి, వారిని నిలువునా దోచుకున్న వైనం ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్ పూజ కోసం బిహార్ లోని సొంత ఊరికి వెళ్లి తిరిగి ఢిల్లీకి తిరిగి వస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కుటుంబానికి ఈ ఘోరమైన అనుభవం గత శుక్రవారం ఎదురైంది. కలకలం రేపిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ వాస్తవ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య, కొడుకు తీవ్రగాయాలతో ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబోధ్ శ్రీవాస్తవ్ (42) భార్య సుష్మ, కొడుకు ప్రియన్ తో కలిసి ఢిల్లీకి వస్తూ అనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో దిగాడు. అక్కడినుంచి ఇంటికి రావడానికి ఆటో మాట్లాడుకున్నారు. అతి వేగంగా నడుపుతున్న ఆటో డ్రైవర్ ను రెండు సార్లు వారించాడు శ్రీ వాస్తవ్. అయినా వినకుండా మరింత వేగం పెంచాడా డ్రైవర్. దీంతో అదుపు తప్పిన ఆటో డివైడర్ ఢీకొట్టి పల్టీ కొట్టింది. శ్రీవాస్తవ ఆటో కిందపడి చనిపోయాడు. అయితే బాధితులను ఆదుకోవాల్సిన ఆటోడ్రైవర్ మనసులో దుర్బుద్ధి పుట్టిందో ఏమో తెలియదు కానీ, వారికి సంబంధించిన మూడు బ్యాగులను, ల్యాప్ ట్యాప్ ను తీసుకుని అక్కడినుంచి ఉడాయించాడు.
వేగంగా నడపొద్దని తన భర్త వారించినా వినకుండా డ్రైవర్ చాలా ర్యాష్ గా మాట్లాడి మరింత వేగం పెంచాడని శ్రీవాస్తవ్ భార్య సుష్మ ఆరోపించారు. దీంతో ఆటో తిరగబడి పోయిందని ఆమె తెలిపారు. తన భర్త ఆటో కింద పడిపోగా, కొడుకు దూరంగా పడిపోవడం తనకు లీలగా గుర్తుందని తెలిపింది.
ఆటోను పక్కకు తీసిన డ్రైవర్ సామాను ఆటోలో పెడుతోంటే, తమకు సాయం చేస్తున్నాడనుకున్నాననీ, కానీ తమ బ్యాగులు తీసుకుని అక్కడినుంచి పరారవుతాడని అస్సలు ఊహించలేదని అన్నారు. ఆ తరువాత కొద్దిసేపు తనకేమీ తెలియలేదనీ, మెల్లిగా తేరుకుని, ఆ దారిన వెళుతున్న వాహనదారులను సాయమడిగి ఆసుపత్రికి చేరామంటూ ఆ దుర్ఘటను గుర్తు చేసుకున్నారు. తన భర్త మరణానికి కారణమైన ఆ ఆటోడ్రైవర్ ని గుర్తు పడతానని తెలిపారు.