ఆగిన సేవలు
Published Tue, Feb 11 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
సాక్షి, చెన్నై: వేతనాలు పెంచాలని, బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని 11,252 బ్యాంకుల్లో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు సోమవారం విధుల్ని బహిష్కరించారు. దీంతో బ్యాంకుల్లో సేవలు స్తంభించాయి. లావాదేవీలు నిలిచి పోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమ్మె బుధవారం వరకు కొనసాగనుంది.
మూతపడిన బ్యాంకులు
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ మినహా మిగిలిన అన్ని బ్యాంకు లు మూతపడ్డాయి. నగదు బట్వాడా, చెక్కుల మార్పిడి తదితర అన్ని రకాల సేవలు ఆగిపోవడంతో ఖాతాదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో నగదు కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి. నిత్యం ఖాతాదారులతో కిటకిటాలాడే బ్యాంకులు బోసిపోయాయి. నగదు కోసం ఏటీఎంలకు వెళ్లినా క్యూలో బారులు తీరాల్సిన పరిస్థితి. కొన్ని ఏటీఎంలలో నగదు ఖాళీ అయింది. అనేక ఏటీఎంల ముందు ‘నో మని’ బోర్డులు తగిలించారు. ఆన్‌లైన్ సేవలు సైతం ఆగిపోయూయి. మంగళవారం కూడా సమ్మె కొనసాగుతుండడంతో మరెన్ని ఇబ్బందులు పడాలోనని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగుల ఆందోళన బాట
విధుల్ని బహిష్కరించిన ఉద్యోగులు తమ కార్యాలయాల వద్ద నిరసనలు తెలియజేశారు. చెన్నైలోని ఉద్యోగులు భారీ ఎత్తున కదం తొక్కారు. ప్యారిస్‌లోని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇందులో అఖిల భారత ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ ఇటీవల జరిగిన చర్చల మేరకు పది శాతం మాత్రమే వేతన పెంపునకు నిర్ణయించారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ఈ పెంపు ఏ మూలకూ సరిపోదన్నారు. ఐదేళ్లకొకసారి వేతన పెంపు నిర్ణయం తీసుకుంటున్నారని, ఈ క్రమంలో తమ డిమాండ్‌కు తగ్గట్టుగా పెంచి తీరాల్సిందేనని పట్టుబట్టారు. బ్యాంకుల ద్వారా పలు ప్రభుత్వ పథకాలు అమల్లో ఉన్నాయని, ఈ పథకాల అమల్లో తమ పాత్ర ఉందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పారు. తమ సమ్మెలో ఒక్క రోజు రాష్ట్రంలో రూ.90 లక్షల చెక్కులు పెండింగ్‌లో పడ్డాయని, తాము ఆందోళనలు ఉద్ధృతం చేస్తే పరిస్థితి దారుణం అవుతుందన్న విషయాన్ని గ్రహించాలని కేంద్రాన్ని హెచ్చరించారు.
Advertisement
Advertisement