బ్యాంకులమూత
Published Wed, Feb 12 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జాతీయ బ్యాంకులు తలపెట్టిన అఖిల భారత సమ్మె మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. బ్యాంకుల సమ్మెతో రాష్ట్రంలోని ఆర్థిక లావాదేవీల్లో భారీ స్తంభన ఏర్పడింది. పనిభారానికి తగిన జీతాలు అందడం లేదని, విధులకు తగిన జీతాలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న ప్రయత్నాలను నిలిపివేయాలని తదితర డిమాండ్లతో దేశంలోని అన్ని జాతీయ బ్యాం కులు ఈనెల 10వ తేదీ నుంచి సమ్మె ప్రారంభించాయి. దేశంలో ముంబై, ఢిల్లీ తరువాత అతిపెద్ద వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కేంద్రమైన తమిళనాడుపై సమ్మె ప్రభావం భారీగానే పడింది. రాష్ట్రంలో సుమారు 8 లక్షల మంది బ్యాంకు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. బ్యాంకుల ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధి, పింఛన్‌పై ఆధారపడి ఉన్నవారంతా సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమ్మె ముగిసి ఉంటుందన్న ఆశతో వందలాది మంది ఖాతాదారులు బ్యాంకుల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగిపోయారు. అన్ని రంగాలకు సంబంధించి కోట్లాదిరూపాయల చెక్కులు నిలిచిపోయాయి.
ఏటీఎంలు ఖాళీ
బ్యాంకు సిబ్బంది సమ్మె ఎపుడు విరమిస్తారో తెలియక ఆందోళనకు గురైన ఖాతాదారులు ముందు జాగ్రత్తగా ఏటీఎంలకు పరుగులెట్టారు. రాష్ట్రం మొత్తం మీద 7,500 ఏటీఎంలు ఉండగా, చెన్నైలో మాత్రమే 600 ఉన్నాయి. సమ్మె ప్రభావంతో రెండు రోజుల్లోనే దాదాపు అన్ని ఏటీఎంలు ఖాళీ అయ్యాయి. బ్యాంకులు మూసివేసి, ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసే అవకాశంలేక పోవడం ఖాతాదారులను బాధిస్తోంది. ఇదిలా ఉండగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వార్షికోత్సవంలో ఇటీవల ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సమ్మెకు ఆజ్యం పోసింది. బ్యాంకుల ద్వారా లభిస్తున్న ఆదాయాన్నంతా ఉద్యోగుల జీతాలకే వెచ్చించాలని కోరుకోవడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement