‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
‘మహా బతుకమ్మ’కు భారీ ఏర్పాట్లు
Published Fri, Oct 7 2016 2:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
ఎల్బీస్టేడియం, ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ వేడుకలు
బతుకుమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఘాట్లు
ఏర్పాట్లను పరిశీలించిన
జీహెచ్‌ఎంసీ కమిషనర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మహా బతుకమ్మ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్బీ స్టేడియం, ట్యాంక్ బండ్ లపై మహా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం ట్యాంక్ బండ్ పై ఉత్సవ ఏర్పాట్లను జీహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉత్సవ వాతావరణం కనిపించేలా విద్యుత్ దీపాలతో ఆకర్షనీయంగా తీర్చిదిద్దుతున్నారు. బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా కొలనులను ఏర్పాటుచేస్తున్నారు. ఈనెల 8న ఎల్బీస్టేడియంలో, 9న ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు గాను 1060 మంది పారిశుధ్య కార్మికులు, 95 మంది ఎస్‌ఎఫ్‌ఏలతో కూడిన 11 బతుకమ్మ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా
ఎల్బీస్టేడియంలో నిర్వహించే మహా బతుకమ్మతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. మహా బతుకమ్మకు నగరంలోని పదివేల మంది స్వయం సహాయక బృందాల మహిళలు హాజరుకానున్నారు. ట్యాంక్‌బండ్‌తో పాటు సరూర్‌నగర్, ఐడీఎల్ చెరువు, హస్మత్‌పేట్ చెరువు, ప్రగతీనగర్ చెరువు, సున్నం చెరువు, గంగారం చెరువు, దుర్గం చెరువు, పల్లెచెరువు, పెద్ద చెరువు తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను నిర్వహణకు విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, రోడ్ల మరమ్మతులు, ప్రత్యేక లైటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే నగరంలోని దాదాపు 100ప్రాంతాల్లో భారీ బతుకమ్మలను ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగ ఔనత్యాన్ని తెలిపే హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. నగరం వివిధ మతాలు, సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని, నగర ఔనత్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కమిషనర్ నగరవాసులను సూచించారు.
నిమజ్జనానికి ప్రత్యేక కొలనులు
నగరంలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి గాను ప్రత్యేకంగా నిర్మించిన కొలనులను బతుకమ్మల నిమజ్జనానికి ఉపయోగించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించినట్లు కమిషనర్ తెలిపారు. హుస్సేన్‌సాగర్ జలవిహార్ సమీపంలోని నిమజ్జన కొలను వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. బతుకమ్మల నిమజ్జనానికి కొలనును స్వచ్ఛమైన నీటితో నింపాలని, కొలను చుట్టూ బతుకమ్మలు అడే విధంగా మైదానాన్ని చదును చేయడంతో పాటు లైటింగ్, మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్, శంకరయ్య, చీఫ్ ఇంజనీర్ సుభాష్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement