బ్యాటరీ కార్ల సేవ అంతంతమాత్రమే | Battery car service Europe | Sakshi
Sakshi News home page

బ్యాటరీ కార్ల సేవ అంతంతమాత్రమే

Published Tue, Jul 15 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

బ్యాటరీ కార్ల సేవ అంతంతమాత్రమే

బ్యాటరీ కార్ల సేవ అంతంతమాత్రమే

 అన్నానగర్:సెంట్రల్ రైల్వే స్టేషన్-ఎగ్మూరు రైల్వే స్టేషన్లలో వృద్ధులు, వికలాంగులకు నిర్దేశించిన బ్యాటరీ కార్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీటిని ఇతర వ్యా పారాలకు వాడుకోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మేరకు దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. వృద్ధులూ - వికలాంగులను నిర్దేశిత ప్లాట్‌ఫాంలైన రైళ్ల వద్దకు చేర్చడానికి స్టేషన్ అధికారులు ఈ కార్లను ఏర్పాటు చేశారు. నిస్సహాయ ప్రయాణికులు ఈ బ్యాటరీ కార్ల సేవ కోసం డబ్బు చెల్లించాల్సి వస్తోంది. మనిషికి రూ.10 నుంచి రూ.15 ఇస్తేనే బ్యాటరీ కార్ల ఆపరేటర్ వారిని ప్లాట్‌ఫాంలపైకి చేరుస్తున్నారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే వాణిజ్య పార్శిల్స్‌ను ఈ కార్లపై ఉంచుకొని డబ్బు సంపాదించుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
 
 కొందరు ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదులు ఇస్తే సదరు అధికారులు బ్యాటరీ కారు ఆపరేటర్‌ను ప్రశ్నించడానికి వచ్చినపుడు కారులో బ్యాటరీ డౌన్‌లో ఉందనో లేక ఇతర సాంకేతిక లోపాలో చెప్పి ఆపరేటర్లు తప్పించుకుంటున్నారు. సెంట్రల్ రైల్వే స్టేషన్లో మొత్తం 11 ప్లాట్‌ఫారాలుండగా కేవలం 3 బ్యాటరీ కార్లను మాత్రమే నడుపుతున్నారు. ఎగ్మూరు స్టేషన్లలో ఆరు ప్లాట్‌ఫారాలకు ఒకే కారు వినియోగంలో ఉంది. ఇతర రాష్ట్రాలూ - జిల్లాల నుంచి వైద్య పరీక్షల కోసం చెన్నైకు రోజూ కనీసం వంద నుంచి 250 వరకు వృద్ధులూ, వికలాంగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాటరీ కార్ల ఆపరేటర్ల వైఖరి వారిని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తోంది. మెట్లు దిగి ప్లాట్‌ఫారాలు మారాల్సివస్తే ఈ బ్యాటరీ కార్ల ఆపరేటర్లు ఏ మాత్రం సాయం చేయడం లేదు.
 
 కేవలం మెట్ల వద్దనే వారిని దింపేసి ‘మీ చావు మీరు చావండి’ అని చెప్పి జారుకుంటున్నారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చి రెండు నెలలు దాటుతున్నా ఈ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్ట లేదు. వృద్ధులూ - వికలాంగుల సమస్యకు రైల్వే వద్ద సత్వర పరిష్కార మార్గాలున్నా వాటిని అమలుపర్చడంలో ఎందుకు జాప్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్లాట్‌ఫాంకూ - ప్లాట్ ఫాంకు మధ్య రిమూవబుల్ లింక్ ట్రాకులను వేసి బ్యాటరీ కార్ల సేవలను అన్ని ప్లాట్‌ఫాంలపై నున్న వృద్ధులకూ - ప్రయాణికులకు అందించే ప్రయత్నంలో ఉన్నామని నిర్వాహకులు తెలిపారు. 45 రోజుల వ్యవధిలో ఈ సమస్యను పరిష్కరిస్తామని వారు హామీను ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement