
సాక్షి, బెంగళూరు: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని వచ్చే నెల 1 నుంచి బీర్ల ధరలను పెంచేందుకు అబ్కారీ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త ధరలను అమలవుతాయి. డిమాండ్ పెరగడంతో మద్యం దుకాణాల్లో బీర్ల ధరలను అనధికారికంగా పెంచి అమ్ముతున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వానికి ప్రతిపాదించిన ధరల ప్రకారం 650 ఎంఎల్ బీర్ బాటిల్ ధర రూ. 10 నుంచి రూ. 20 మేర పెరిగుతుంది. బీర్ ధరల పెంపుపై ఇప్పటికే బడ్జెట్‌లో ప్రకటన చేశారు.
అలాగే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. మరో మూడు నాలుగు రోజుల్లో బీర్ ధరల పెంపుకు సంబంధించిన కొత్త ధరలను అబ్కారీ శాఖ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ పన్నును 150 శాతం నుంచి 175 శాతం మేర పెంచనున్నారు. ఈ పెంపు ద్వారా బీర్‌పై రూ. 10 నుంచి రూ.20 మేర ధర పెరిగే అవకాశం ఉంది. అబ్కారీ శాఖ వివరాల ప్రకారం గడిచిన 10 ఏళ్లలో బీర్ల కొనుగోలు ఐదు రెట్లు పెరిగాయి. అబ్కారీ శాఖ ద్వారా ఏడాదికి రూ. 2,400 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. 2019–20 ఆర్థిక ఏడాదిలో ఆ ఆదాయన్ని రూ. 2,800 కోట్లకు పెంచాలని లక్ష్యంగా చేసుకున్నారు. మద్యంతో ప్రలోభాలకు గురిచేసి ఓట్లను రాబట్టుకునే అవకాశం ఉండడంతో ఎన్నికల సంఘం మద్యం, బీర్ల అమ్మకాలపై గట్టి నిఘా వేసింది.