‘భవాని’ వద్దు
* సుప్రీం కోర్టుకు డీఎండీకే
* జయలలిత కేసుకు వ్యతిరేకంగా పిటిషన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అప్పీలు పిటిషన్ విచారణకు ప్రభుత్వ న్యాయవాదిగా భవానీసింగ్‌ను నియమించొద్దంటూ డీఎండీకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భవానీసింగ్‌ను తప్పించి, మరో న్యాయవాదిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని పిటిషన్ రూపంలో గురువారం విన్నవించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలుశిక్ష పడ్డ విషయం తెలిసిందే. జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతోపాటుగా ఇలవరసి, సుధాకరన్‌కు జైలు శిక్ష పడడంలో కీలక భూమిక పోషించిన న్యాయవాది భవానీ సింగ్.
ప్రభుత్వ తరపున తన వాదనలను ప్రత్యేక న్యాయస్థానం ముందు ఉంచి, జైలు శిక్షపడేలా చేశారు. అయితే, జయలలిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఎట్టకేలకు కర్ణాటక న్యాయ స్థానం నుంచి బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టుకు చేరింది.
అక్కడ నిబంధనలతో కూడిన బెయిల్ జయలలిత అండ్ బృందానికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తమకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ జయలలిత అండ్ బృందం కర్ణాటక న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్లడానికి సిద్ధమైంది. అప్పీలు పిటిషన్ దాఖలుకు తగ్గ కసరత్తులు వేగవంతం అయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఇచ్చిన గడువు ఆధారంగా విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.
ఆయన్ను తప్పించండి: జయలలిత అండ్ బృందం అప్పీలు పిటిషన్ విచారణకు ప్రభుత్వ న్యాయవాదిగా భవానీ సింగ్ హాజరయ్యే అవకాశాలు ఎక్కువే. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, అవగాహన ఆయనకే ఉన్నారుు. అయితే, కర్ణాటక న్యాయ స్థానంలో బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో భవానీ సింగ్ వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకున్న డీఎండీకే ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు ఎక్కింది.
డీఎండీకే న్యాయవాది మణి ఈ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. భవానీ సింగ్‌ను ప్రభుత్వ న్యాయవాదిగా తప్పించి, ఆయన స్థానంలో అప్పీలు పిటిషన్ విచారణకు మరో న్యాయవాదిని నియమించాలని విన్నవించారు. ఒక వేళ భవానీ సింగ్ వాదించిన పక్షంలో కేసు నీరుగారే అవకాశాలుంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని భవానీసింగ్‌ను తప్పించేలా కర్ణాటక న్యాయ స్థానానికి సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు బెంచ్ విచారణకు స్వీకరించింది. అదే సమయంలో ఇదే విషయాన్ని వివరిస్తూ, కర్ణాటక హైకోర్టును సైతం ఆశ్రయించవచ్చుగా అని పిటిషనర్‌కు సూచించడం విశేషం.