బడ్జెట్ వాయిదాకు సుప్రీం నో
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్ని కలు జరగనున్నందున, అవి పూర్తయ్యే వరకు కేంద్ర బడ్జెట్ సమర్పణను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. ఐదు రాష్ట్రాల ఓటర్లను బడ్జెట్ ప్రభావితం చేస్తుందనేదానికి సంబంధించి ఏ నిర్దిష్ట కారణం లేదంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సమర్పణకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టాలనుకున్న 2017–18 బడ్జెట్‌ను.. ఏప్రిల్ 1న ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది ఎమ్.ఎల్ శర్మ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
ఈ ఎన్నికలయ్యేంత వరకు కేంద్రం ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించకుండా చూడాలని పిల్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకిస్తూ.. నిరంతరం జరిగే రాష్ట్రాల ఎన్నికలపై కేంద్ర బడ్జెట్ సమర్పణ ఆధారపడి ఉండబోదన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ఓటర్లను ప్రభావితం చేసేలా కేంద్రం వరాలు ప్రకటించే అవకాశం ఉందన్న వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వాదన అర్థరహితమంది. పిటిషనర్ వాదన చూస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకూడద న్నట్లుందని చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతంలో కేంద్ర బడ్జెట్ సమర్పణను వాయిదా వేశారన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.