కళంకిత నేతలు పోటీచేయొచ్చా?
వారి భవితవ్యం తేల్చేందుకు త్వరలో ఐదుగురు జడ్జీల బెంచ్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో.. సుప్రీం కోర్టు కీలకనిర్ణయం తీసుకోనుంది. కళంకిత నేతల భవిష్యత్ నిర్ణయించడానికి త్వర లో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయబోతున్నామని గురువారం సుప్రీం కోర్టు తెలిపింది. తీవ్రమైన నేరారోపణలతో విచారణ ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు, విచారణ ఏ దశలో ఉండగా ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటించవచ్చు అనే అంశాలపై ఈ ధర్మాసనం తీర్పునివ్వనుంది. ‘ఈ అంశాలపై స్పష్టతనిస్తే.. వచ్చే ఎన్నికల్లోగా చట్టం గురించి ప్రజలు తెలుసుకుంటారు’ అని ఒక పిల్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు.
కొంతమంది నేరగాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఈ తరుణంలో త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఎన్నికల్లో క్రిమినల్స్ పోటీపై అత్యవసరంగా తేల్చాల్సి ఉందంటూ బీజేపీ ప్రతినిధి అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ఖేహార్ నేతృత్వం లోని ధర్మాసనం విచారించింది. తప్పుడు కేసులు దాఖలయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోలేమని వ్యాఖ్యానించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల్లో సంవత్సరంలోపు విచారణ పూర్తి చేయా లని, విచారణను రోజువారీ విధానంలో కొనసాగించాలని కింది కోర్టులను ఆదేశించింది. విచారణ జాప్యంతో తీవ్ర నేరారోపణ ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు పదవుల్లోనే కొనసాగుతు న్నారని ధర్మాసనం వాఖ్యానించింది.