జయకేసులో మెలిక
చె న్నై, సాక్షి ప్రతినిధి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎదురుచూస్తుండగా తాజాగా మరో మెలిక ఎదురైంది. జయ అప్పీలు కేసును వాదిస్తున్న ప్రభుత్వ న్యాయవాది భవానీసింగ్ నియామకంలో రేగిన వివాదమే తాజా మెలికకు కారణమైంది. జయ ఆస్తుల కేసుపై కర్ణాటక ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై జయలలిత సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. వెలువడిన తీర్పు ప్రకారం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు సుమారు పదేళ్లపాటూ జయ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి లేదు. అప్పీలపై వెలువడే తీర్పుపై జయ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో దేశమంతా తీర్పు కోసం ఆతృతతో ఎదురుచూస్తోంది. జయ అప్పీలు కేసును విచారించాలని క ర్ణాటక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమారస్వామిని సుప్రీం కోర్టు నియమించింది.
మూడునెలల్లోగా కేసు విచారణను ముగించాలని సైతం సుప్రీం ఆదేశించింది. జయ అప్పీలు కేసు వాదనకు తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా భవానీసింగ్ నియమితులయ్యారు. మూడు నెలల్లోగా అప్పీలుపై విచారణను పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాల కారణంగా బెంగళూరు కోర్టులో ప్రతిరోజూ విచారణ సాగింది. జయ తరపున వాదనను భవానీసింగ్ దాదాపూ పూర్తి చేశారు. అయితే భవానీసింగ్ నియామకం చెల్లదంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ను సుప్రీం నియమించింది. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి మదన్‌లోకూర్...భవానీసింగ్ నియామకం చెల్లదని, మరోన్యాయమూర్తి భానుమతి చెల్లుతుందని పేర్కొంటూ ఈ నెల4వ తేదీన తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఈ పరిణామంతో సుప్రీం కోర్టు మరోసారి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు ఈ బాధ్యతను అప్పగించాలని నిర్ణయించింది. ఈ ముగ్గురు న్యాయమూర్తుల ఎంపికపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు గత కొన్ని రోజులుగా కసరత్తు చేశారని తెలిసింది. కసరత్తు పూర్తికాగా ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీం కోర్టు రిజిష్ట్రారు శనివారం ప్రకటించారు. భవానీసింగ్ నియామకంపై డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఆర్కే అగర్వాల్, ప్రపుల్ల సీ చంద్ ఈనెల 21వ తేదీ నుంచి విచారణ ప్రారంభిస్తారు. జయ, డీఎంకే తరపు న్యాయవాదులు హాజరై తమ వాదనను మరోసారి వినిపిస్తారు. ముగ్గురు న్యాయమూర్తుల్లో ఆర్కే అగర్వాల్ గతంలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
ఈ ముగ్గురు న్యాయమూర్తులు రెండువారాల్లో విచారణ పూర్తిచేసి భవానిసింగ్ నియామకం చెల్లుతుంది అని తీర్పు వెలువడితే క ర్ణాటక ప్రత్యేక న్యాయస్థానం అప్పీలు విచారణపై వెంటనే తీర్పు చెప్పాల్సి ఉంటుంది. భవానీసింగ్ నియామకం చెల్లదని తీర్పు వెలువడిన పక్షంలో తమిళనాడు ప్రభుత్వం అప్పీలుకు వెళుతుంది. అప్పీలు వల్ల అసలుకేసులో తీర్పు వాయిదా పడే అవకాశం ఉంది. జయ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం అసలు కేసుకాగా, భవానీసింగ్ నియామకంపై దాఖలైన పిటిషన్ కొసరు కేసుగా మారింది. జయ ఆస్తుల కేసులో తీర్పు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారు మరికొంత కాలం వేచి ఉండక తప్పనిస్థితి నెలకొంది.