బెంగళూరు: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామిపై కర్ణాటకలో కేసు నమోదైంది. 2006–08 కాలంలో కర్ణాటక సీఎంగా ఉన్న కాలంలో కుమారస్వామి ఒక గనుల తవ్వకం సంస్థకు అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారని గతంలో ఒక కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్ తాజాగా ఫిర్యాదుచేయడంతో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కుమారస్వామిపై కేసు నమోదైంది.
కుమారస్వామి ప్రభుత్వ అధికారిగా తన విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారని, తనను బెదిరించారని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించి నాడు బళ్లారి జిల్లాలో శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ సంస్థకు 550 ఎకరాల్లో గనుల తవ్వకం అనుమతులు ఇచ్చారని కుమారస్వామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
కుట్రపూరిత కేసు: కుమారస్వామి
తాజా కేసుపై కుమారస్వామి స్పందించారు. ‘‘ ఇది పూర్తిగా కుట్రపూరితంగా నమోదుచేసిన కేసు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఐజీపై నేను పత్రికాసమావేశంలో ఆరోపణలు చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నిజమని నిరూపించగలరా? కావాలంటే ప్రెస్‌మీట్ వీడియోను మరోసారి చూడండి. ఈ కేసును నేను చట్టప్రకారమే ఎదుర్కొంటా’’ అని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment