చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ శ్రేణులు సాగించిన విధ్వంసకాండపై మద్రాసు హైకోర్టులో దాఖలై న ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.వ్యాజ్యంలో పేర్కొన్న అంశాలపై నెలరోజుల్లోగా బదులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు గత నెల 27వ తేదీన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ బెంగళూరు కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన రోజు నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అనేకచోట్ల ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ విధ్వంసంపై అన్బగళన్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
విధ్వంసానికి కారకులైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత, ఆ పార్టీ నేతల నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయూలని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వ అధికారులు స్పందించలేదు. దీంతో మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ 2012లో జరిగిన అల్లర్లకు పీఎంకే కారణమని ఆరోపిస్తూ అప్పటి సీఎం జయలలిత వారి నుంచి నష్టపరిహారం రాబట్టే ప్రయత్నం చేశారని కోర్టుకు తెలిపారు. నేడు అదే క్రమంలో అన్నాడీఎంకే నుంచి నష్టపరిహారం రాబట్టేలా ప్రభుత్వాధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ అగర్వాల్, న్యాయమూర్తి సత్యనారాయణతో కూడిన బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై నెలరోజుల్లోగా బదులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విధ్వంసాలపై పిటిషన్
Published Tue, Oct 14 2014 11:47 PM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement