జయ గెలుపు సబబే
హైకోర్టు తీర్పు
టీనగర్: ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలో జయ గెలుపు సబబేనంటూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. జయ గెలుపునకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సేలం, ఆత్తూరు తాలూకా ముల్లైవాడి గ్రామానికి చెందిన న్యాయవాది టి సురేష్ దాఖలు చేసిన ఎన్నికల కేసు పిటిషన్‌లో చెన్నై ఆర్‌కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 27 జూన్ 2015న ఉప ఎన్నిక జరిగిందని, ఇందులో పోటీ చేసిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత గెలుపొందినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ఇష్టపడి గత ఏడాది జూన్ ఎనిమిదో తేదీన నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల్లో పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేసే వారిని కనీసం 10 మంది ఓటర్లు బలపరచాలనేది ఎన్నికల నిబంధన అని, దీంతో పది మంది ఓటర్లు తనను బలపరిచారని తెలిపారు. వారి వివరాలను నామినేషన్ పత్రంతో జతచేశానని, అయితే తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి నిరాకరించినట్లు తెలిపారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు బలపరచిన పదిమందిలో ఒకరైన విఘ్నేష్ పేరును చివరి ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు కారణం పేర్కొన్నారని తెలిపారు. అందులో విఘ్నేష్ చిరునామాలో ఇళయముదలి వీధికి బదులుగా ఇళయముదల్ వీధిగా ఎన్నికల కార్యాలయం మహిళా ఉద్యోగి తప్పుగా నమోదు చేసినట్లు తెలిపారు.
ఇది రాతలో పొరపాటేనని, అందుచేత తన నామినేషన్‌ను నిరాకరించడం అంగీకారయోగ్యం కాదని తెలిపారు. అన్ని వివరాలను సక్రమంగా దాఖలు చేసిన తరుణంలో తన నామినేషన్ నిరాకరణ చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. తదుపరి ఓటర్ల జాబితాలో విఘ్నేష్ పేరును తొలగించినట్లు తెలిపారని, అయితే ఎన్నికల పోలింగ్ రోజున విఘ్నేష్ తన పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇది బూత్‌లోగల నిఘా కెమెరాలో నమోదైందన్నారు. అందుచేత తన నామినేషన్ ఎన్నికల అధికారి నిరాకరించడం సరికాదని, అందుచేత తన నామినేషన్ నిరాకరణ చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ ఆర్‌కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపారు. పిటిషన్‌పై విచారణ ముగియగా తీర్పును తేదీ ప్రకటించకుండా వాయిదా వేశారు. ఈ కేసులో గురువారం న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.
ముఖ్యమంత్రి జయలలిత ఉప ఎన్నికలో గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అందులో ఎన్నికల సమయం ముగిసిందని, అందుచేత ఈ పిటిషన్ విచారణకు తగదని తీర్పునిచ్చారు.పరువునష్టం కేసు విచారణకు స్టే: హైకోర్టు ఉత్తర్వులు:నక్కీరన్ గోపాల్‌పై దాఖలైన 18 పరువునష్టం కేసుల విచారణకు స్టే విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. నక్కీరన్ పత్రికా సంపాదకుడు నక్కీరన్ గోపాల్, రిపోర్టర్ ప్రకాశ్‌లపై ముఖ్యమంత్రి జయలలిత సహా మంత్రులు చెన్నై జిల్లా సెషన్స్ కోర్టులో 18 క్రిమినల్ పరువునష్టం కేసులను దాఖలు చేశారు.
ఈ కేసులలో నేరుగా హాజరుకావాలంటూ నక్కీరన్ గోపాల్ తదితరులకు సెషన్స్ కోర్టు సమన్లు పంపింది. ఇలావుండగా తనపై దాఖలైన పరువునష్టం కేసుల్లో విచారణకు స్టే కోరుతూ మద్రాసు హైకోర్టులో నక్కీరన్ గోపాల్ కేసు దాఖలుచేశారు. ఈ కేసు గురువారం విచారణకు వచ్చింది. ఈ కేసుల విచారణకు స్టే విధించరాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుతరఫు వాదనలు విన్న న్యాయమూర్తి నక్కీరన్ గోపాల్‌పైన 18 పరువునష్టం కేసుల విచారణకు స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చారు.